News

తిరుమలకు ప్రత్యేక టూర్‌ ప్యాకేజీ

46views

తిరుమల ప్రయాణికులకు శుభవార్త. ఇబ్బందులు లేకుండా తిరుమలేశుని దర్శనం చేసుకొనే భాగ్యాన్ని పర్యాటక శాఖ కల్పించనుంది. ఇందుకోసం విశాఖ నుంచి రోజూ తిరుమలకు ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ నెల 19 నుంచి 30 స్లీపింగ్‌ బెర్తులతో ఏసీ బస్సు అప్పుఘర్‌ నుంచి బయలుదేరనుంది. తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూనే ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు రిలీజ్‌ చేసే రోజు ప్రతి ఒక్కరూ కంప్యూటర్‌, మొబైల్‌కు అతుక్కుపోతారు. టికెట్ల కోసం అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. దేశవ్యాప్తంగా భక్తులు టికెట్ల కోసం పోటీ పడడంతో చాలా మందికి టికెట్లు దొరికే పరిస్థితి ఉండదు. అయితే త్వరలో విశాఖ వాసుల కోసం పర్యాటక శాఖ సరికొత్త టూర్‌ ప్యాకేజీ అందుబాటులోకి తీసుకొస్తోంది.

రోజూ ప్రత్యేక బస్సు సర్వీసు
విశాఖ నుంచి తిరుపతికి 30 స్లీపింగ్‌ బెర్త్‌లతో (ఏసీ స్లీపర్‌) బస్సు ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 19న మధ్యాహ్నం 3 గంటల నుంచి రోజూ ఈ సర్వీసు అందుబాటులోకి రానుంది. రోజూ అప్పూఘర్‌ యాత్రి నివాస్‌ హోటల్‌ (హరిత టూరిజం హోటల్‌) నుంచి ప్రారంభమై ఎంవీపీ కాలనీ, మద్దిలపాలెం, ఆర్టీసీ కాంప్లెక్స్‌, ఎన్‌ఏడీ జంక్షన్‌, గాజువాక, అనకాపల్లి, రాజమండ్రి, శ్రీకాళహస్తి మీదుగా తిరుపతి చేరుకుంటుంది. ఈ టూర్‌ ప్యాకేజీలో భాగంగా పెద్దలకు రూ.6300, పిల్లలకు రూ.6 వేలు చార్జ్‌ చేయనున్నారు. 19న తొలి సర్వీసును జిల్లా కలెక్టర్‌ హరీందిర ప్రసాద్‌, జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, ఏపీటీడీసీపీ రీజినల్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ పాణి ప్రారంభించనున్నారు. టికెట్లను ఏపీటీడీసీ వెబ్‌సైట్‌ ద్వారా, లేదా 8897464333 (మార్కెటింగ్‌), సీఆర్‌వో 9848813584 నంబర్‌ ద్వారా ప్రయాణానికి వారం రోజులు ముందుగా బుక్‌ చేసుకోవాలని ఏపీటీడీసీ రీజినల్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌పాణి తెలిపారు.

టూర్‌ సాగేది ఇలా…

● మొదటి రోజు విశాఖ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రయాణం.

● రెండో రోజు శ్రీకాళహస్తి హరిత హోటల్‌లో ఫ్రెష్‌అప్‌, అల్పాహారం.

● అనంతరం అదే రోజు తిరుపతి దర్శనం, ఏపీటీడీసీ శ్రీనివాసం హోటల్‌లో మధ్యాహ్నం భోజనం.

● అదే రోజు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ దర్శనం, అనంతరం శ్రీకాళహస్తిలో హరిత హోటల్‌లో రాత్రి భోజనం.

● భోజనం అనంతరం విశాఖకు తిరుగు ప్రయాణం.

● మూడో రోజు ఉదయం 9 గంటలకు విశాఖ చేరుకోవడంతో టూర్‌ ముగుస్తుంది.