News

ఇస్లాం చెప్పింది ఒకటి… భారత ఇమాంలు చేస్తోంది మరొకటి..

59views

భారతదేశ జనాభా చైనాను మించిపోయినట్లు ఇటీవల ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం అంచనా వేసింది. ప్రస్తుతం మన దేశ జనాభా 142.86 కోట్లు కాగా చైనా జనాభా 142.57 కోట్లుగా వెల్లడించారు. ఈ పరిస్థితిని మనం ముందుగానే ఊహించాం కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోవాల్సింది లేదు. అయితే ఇక్కడ ఆందోళన చెందాల్సిన అంశం ఏంటంటే, హిందువుల జనాభా నిష్పత్తి తగ్గుతుంటే, ముస్లిం జనాభా పెరుగుతోంది. దీంతో దేశ జనాభా సమతౌల్యం క్రమంగా దెబ్బతింటూ వస్తోంది.

అస్సాంలో పెరుగుతున్న ముస్లిం జనాభా పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మారుతున్న జనాభా నిష్పత్తి పట్ల తనకు ఆందోళనగా ఉందని, ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిందని అన్నారు. జనాభా పెరగడమనేది తనకు రాజకీయం కాదని, జీవన్మరణ సమస్య అని హిమంత బిశ్వ వ్యాఖ్యానించారు. 1951లో 12 శాతం ఉన్న ముస్లిం జనాభా ప్రస్తుతం 40 శాతానికి చేరుకుంది. హిమంత ముస్లిం జనాభా గురించి మాట్లాడడం ఇది తొలిసారి కాదు. జూన్ 2021లో అస్సాం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే ఆయన మాట్లాడుతూ, అస్సాంలో మైనారిటీ ముస్లింలలో ఆర్థిక అసమానతలు, పేదరికానికి జనాభా విస్ఫోటనమే కారణమన్నారు.

అస్సాంలో ముస్లిం జనాభా పెరుగుదలకు ప్రధాన కారణం అక్రమ వలసలు. అస్సాంని ఆనుకొని ఉన్న బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు కొనసాగుతున్నాయి. వీటిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

అస్సాంలోనే కాదు దేశవ్యాప్తంగా ముస్లిం జనాభా పెరుగుతోంది. ఇందుకు కారణం కుటుంబ నియంత్రణ పాటించకపోవడమే. ఇస్లాం కుటుంబ నియంత్రణను అంగీకరించదని, దాన్ని పాటించి భగవంతుడు ఇచ్చే పిల్లలను కనే హక్కును నిరాకరించడం అపరాధం అనే అపోహలను ఇస్లాం ఛాందసవాదులు, మత పెద్దలు పెంచుతూ వచ్చారు. దీని కారణంగా జనాభాతో పాటు ఛాందసవాదం, పేదరికం, అవిద్య కూడా పెరుగుతూ వచ్చింది. నిజానికి పవిత్ర ఖురాన్‌లో ఎక్కడా కూడా కుటుంబ నియంత్రణను నిషేధించలేదు. మహ్మద్ ప్రవక్త కూడా దీనికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. నిజం చెప్పాలంటే, ఖురాన్ పరోక్షంగా కుటుంబ నియంత్రణను అనుమతించింది. ఎలా అంటే, 2 సంవత్సరాల పాటు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలని ఖురాన్ ఆదేశించింది. ఇది ఒక రకంగా తల్లీబిడ్డల శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది.

ఇరాన్, ఈజిప్ట్, ఇండోనేషియా, బాంగ్లాదేశ్ వంటి సాంప్రదాయ ఇస్లామిక్ దేశాలు కుటుంబ నియంత్రణను పాటిస్తున్నాయి. అక్కడి మతాధికారులు, ఉలేమాలు, మసీదుల్లోని ఇమాంలు కుటుంబ నియంత్రణను ప్రోత్సాహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఇండోనేషియాలో ఇమామ్‌లు మసీదులను కుటుంబ నియంత్రణ ప్రచారానికి కేంద్రంగా ఉపయోగించుకుంటున్నారు.మరో సాంప్రదాయిక ఇస్లామిక్ దేశమైన ఇరాన్ కూడా కుటుంబ నియంత్రణ పద్ధతులను 74శాతం ఆమోదించింది. కానీ మన దేశంలోని ఇస్లాం మత పెద్దలు ఇక్కడి ముస్లింలను గందరగోళానికి గురి చేస్తున్నారు. కుటుంబ నియంత్రణ ఇస్లాంకు విరుద్ధమనే అపోహను విజయవంతంగా పాతుకుపోయేలా చేశారు. ఇప్పటికైనా మన దేశంలోని రాజకీయ పార్టీలు, సంస్థలు ముస్లింలు తమ నిజ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టాలి. అది ముస్లింలకే కాదు దేశానికీ శ్రేయస్కరం.