
శ్రీకాళహస్తి పట్టణంలో చైన్నెరోడ్డులోని శ్రీకాళహస్తీశ్వరాలయా అనుబంధ ద్రౌపదీ సమేత ధర్మరాజస్వామి ఉత్సవాలకు ఏర్పాట్లు నత్తనడకన సాగుతున్నాయి. ఈ నెల 12 నుంచి 21వ తేదీ వరకు ఉత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంగా ఆలయం చుట్టూ పరిసరాల్లో ఏర్పాట్లు నత్తనడకన సాగుతున్నాయి. ఇక ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది. ఇంత వరకు ఉత్సవాలకు పరిసర గ్రామాల నుంచి మాలధారణ చేసుకునే వారు అగ్నిగుండం ప్రవేశం చేయడానికి వస్తారు. ఇప్పటికే వాల్‌పోస్టర్లు విడుదల చేసి గ్రామాల్లో పంపిణీ చేయాల్సి ఉండగా ఆ దిశగా కార్యక్రమాలు సాగడంలేదు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆర్‌జేసీ మూర్తి ఈ ఉత్సవాలపై దృష్టి సారించాల్సి ఉంది. చేయాల్సిన ఏర్పాట్లపై ఆలయ ఉద్యోగులతో చర్చించి పోలీసు, అగ్నిమాపకశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అర్జున తపస్సు కోసం వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు చేయాల్సి ఉంది. విద్యుత్ దీపాలు, చలువపందిళ్లు, క్యూలు, సాంస్కృతిక కార్యక్రమాలకు స్టేజీ తదితర అంశాలన్ని కూడా పరిశీలించి ముందుకు వెళ్లాల్సి ఉండగా ఆ వైపు పనులు సాగడంలేదు. ధర్మరాజస్వామి తిరునాళ్లను విజయవంతం చేయాలంటే కట్టుదిట్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సి ఉంది.




