News

నిర్లక్ష్యానికి గురైన 800 ఏళ్ల నాటి నార్నెపాడు శాసనం

207views

పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం నార్నెపాడు భీమేశ్వరాలయం బయట 800 సంవత్సరాల నాటి క్రీస్తు శకం 12వ శతాబ్దానికి చెందిన శాసనం నిర్లక్ష్యానికి గురవడంపై పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వారసత్వ సంపదను పరిరక్షించి భవిష్యత్తు తరాలకు అందించాలనే లక్ష్యంతో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్న శివనాగిరెడ్డి ఆదివారం చరిత్ర అభిమానులు మణిమేల శివశంకర్, స్వర్ణ చినరామిరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు నార్నెపాడు భీమేశ్వరాలయం బయట ఉన్న శాసనాన్ని పరిశీలించారు. ఆలయ జీర్ణోద్ధరణ సందర్భంగా ఈ శాసనాన్ని రోడ్డుపై పడేశారని, కింద పీఠం, పైన శాసనరాయి, దాని పైన నంది విగ్రహం అలనాటి శాసన విధానాన్ని తెలియజేస్తుందన్నారు. శాసనరాయిపై క్రీస్తు శకం 1151 నాటివి రెండు, క్రీస్తు శకం 1198 నాటిది ఒకటి, క్రీస్తు శకం 12వ శతాబ్దం తేదీలేనివి రెండు, క్రీస్తు శకం 1266 నాటిది ఒకటి, మొత్తం ఆరు శాసనాలున్నాయని తెలిపారు. వీటిని 1933లో నకళ్లు తీయగా ఇటీవల కేంద్ర పురావస్తుశాఖ శాసన విభాగ సంచాలకుడు కె.మునిరత్నంరెడ్డి ప్రచురించారని పేర్కొన్నారు. శ్రీనారాయణపాడు అని శాసనంలో పేర్కొన్న నార్నెపాడు గ్రామంలో క్రీస్తు శకం 1151 శాసనాల్లో వొరిగొండ పోలనామాత్యుడు, మందాడి కొమ్మినామాత్యుడు, క్రీస్తు శకం 1198 శాసనంలో వల్లూరి నామయ నాయకుడు స్థానిక సోమేశ్వర(సోమనాథ), కేశవస్వామి అఖండ దీపాలకు గొర్రెలను దానం చేసినట్లు ఉన్నాయని పేర్కొన్నారు. గ్రామంలోని సోమనాథ ఆలయంలో అదే కాలంలో మండేపూడి సూరమనాయుడు నందిని ప్రతిష్ఠించిన వివరాలున్నాయని చెప్పారు. క్రీస్తు శకం 12వ శతాబ్దం నాటి వెలనాటి రాజేంద్రుని శాసనంలో చందోలు నుంచి పాలిస్తున్న రెండో గొంకరాజు, ఆయన భార్య ప్రోలాంబిక, మంత్రి కొమ్మనామాత్యులు, రెమ్మన అనే కమ్మదేశాధిపతి ప్రస్తావనలు ఉన్నట్లు, ఇంకా అదే గ్రామంలో ద్రోణ(దొర) సముద్రమనే చెరువును తవ్వించిన వివరాలున్నాయని చెప్పారు. కమ్మ దేశాన్ని (కమ్మనాడు) ప్రస్తావిస్తున్న చారిత్రక ప్రాధాన్యం గల 800 ఏళ్ల నాటి ఈ శాసనాన్ని ఆలయంలోకి తరలించి, మళ్లీ యథావిధిగా నిలబెట్టి కాపాడుకోవాలని శివనాగిరెడ్డి గ్రామస్థులను కోరారు.