News

పులొస్తుంది.. వేటాడుతుంది

87views

పులుల సంరక్షణ కేంద్రాల్లో నాగార్జున సాగర్‌ టైగర్‌ రిజర్వ్‌ ఒకటి. విస్తీర్ణంలో ఇది దేశంలోని యాభై మూడింటిలోనే పెద్దది. జిల్లాలో మార్కాపురం అటవీ డివిజన్‌ పరిధిలోని పెద్దదోర్నాల, కొర్రప్రోలు, యర్రగొండపాలెం, గంజివారిపల్లె, నెక్కంటి, వీపీ సౌత్, మార్కాపురం రేంజ్‌లలో విస్తరించి ఉంది. పశ్చిమ ప్రకాశంతో పాటు నంద్యాల, పల్నాడు జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్లమలలో 73కు పైగా పులులున్నాయి. ఈ ప్రాంతం పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, రేసుకుక్కలు వంటి వన్యప్రాణుల జీవనానికి అనువుగా ఉండటంతో వాటి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. అదే సమయంలో వాటికి ఆహారమైన సాంబార్‌లు, దుప్పులు, ఇతర శాఖాహార జంతువుల సంఖ్య తగ్గుతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్ది.. పులుల ఆహార కొరత తీర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. శాఖాహార జంతువుల సంఖ్య పెంచే దిశగా చర్యలు చేపట్టింది.

ప్రైవేట్‌ జూల నుంచి తెచ్చి…
కొందరు పారిశ్రామికవేత్తలు ప్రైవేట్‌ జూలు ఏర్పాటు చేసి వాటిల్లో వన్యప్రాణులను పెంచుతున్నారు. ఈ విధానంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అటవీ ప్రాంతాల్లోనే ఉండాలని స్పష్టం చేసింది. దీంతో ప్రైవేట్‌ జూల్లో ఉన్న శాఖాహార జంతువులను తెచ్చి అటవీ ప్రాంతంలో వదిలేందుకు సంబంధిత అధికారులు సంకల్పించారు. ఇందులో భాగంగా అటవీ ప్రాంతంలో ఒక చోట(ఎన్‌క్లోజర్‌) ఉంచి వాటికి అడవిలో దొరికే ఆహారాన్ని తొలుత అందిస్తారు. అవి ఆ ఆహారానికి, వాతావరణానికి అలవాటు పడేలా చేస్తారు. ఇందుకుగాను మార్కాపురం అటవీ డివిజన్‌ పరిధిలోని పెద్దదోర్నాల రేంజ్‌లో తెట్టెగుండం, కొర్రప్రోలు రేంజ్‌లో పెద్దపెంట, నెక్కంటి రేంజ్‌లో ఆరెపెంట, గంగారపెంట ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్‌క్లోజర్‌లు ఏర్పాటు చేశారు.