ArticlesProgramms

ఒక ద్వారక

32views

లంకానగరం కూడా అయోధ్య, దాని పరిసర ప్రాంతాలంతటి సౌందర్యం, సంపద, నైసర్గిక స్వరూపం విమానయానం కలిగినదే! కుబేరుని అధీనంలో ఉన్నంతవరకూ లంకా నగరం దైవీ సంపదలతో నిండి ఉన్నది. కుబేరుని ఓడించి రావణుడు ఆ నగరాన్ని కైవసం చేసుకున్న తర్వాత లంకానగరం రాక్షసులకూ, రాక్షస గుణగణాలకు నిరంతర ఆవాసం అయిన తర్వాత దానిలో భౌతికమైన నైసర్గికమైన సంపద కుప్పతెప్పలుగా ఉందేగానీ, నైతికమైన, దైవికమైన సంపద మటుమాయమైపోయింది. ఒకానొక రాజునుబట్టి రాజ్యంలోని ప్రజల మనస్తత్వమూ, దానినిబట్టి దైవీసంపద ఉండటమూ, తరగి పోవటమూ జరుగుతుంటుంది. పోషణ వలన, మధిర, మగువ, పరదారాగమనం, సాధు హింస లాంటి రాక్షసత్వంతో లంకానగరం లాటి పటిష్టమైన నైసర్గిక, ప్రకృతి, సహజ సంపదలు, అష్టశ్వర్యాలు సర్వం ఉన్న లంకానగరం సీతాపహరణం లాంటి మహాపాపంతో, శ్రీరామ నైతిక, దైవీశక్తుల ముందు నేలమట్టమైపోయింది.

కంసునిలాంటి పాలకుని నియంత చేతిలో మధురా నగరంలో దైవశక్తులు అణగారిపోయాయి. జరాసంధుని దండయాత్ర లతో మధురానగర ప్రాభవం కనుమరుగై సాక్షాత్తు దైవమే ద్వారకకు తరలివచ్చాడు. ఇక, ద్వారక సముద్ర మధ్య సగం వైకుంఠంగా భాసించింది. ఎందాక? శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామంలో ముప్పాతిక వంతు భూభారాన్ని అణచివేసే
వరకు. ఆయన ఇక అవతార సమాప్తి చేసే సమయం వచ్చింది. సకల సంపదలకు ఆలవాలమైన ద్వారకలోని యదు వంశీయులు తామర తంపరగా పెరిగి శ్రీకృష్ణుని రక్షాపథంలో సుఖసంతోషాలతో జీవించసాగారు. పోతన మహాకవి ద్వారక నగరాన్ని మహాద్భుత అక్షర శిల్పాలలో వర్ణించారు.

క॥ శ్రీకరములు, జన హృదయ వశీకర ములు, మందపవన శీర్ణ, మహాంభ శ్రీకరములు, హంస విహంగాకర ములు, నగరి కువలయాజ్ఞిక రముల్

క॥ నవకుసుమామోద భరాజవనము, రతి భిన్న దేహజస్వేదాంభో లవనము; సమధిగతవనము, పవనము, విహరించు బౌర భవనములందున్,

క॥ తిరుగరు పలుకర్ణులకును, సురుగరు ధనమిత్తు, రితర సుదతీమణులన్… అనే పద్యాలు ద్వారక వైభవానికి మచ్చు తునకలు..

అపర స్వర్గం, వైకుంఠం అయిన ఈ జలదుర్గంలో శత్రుభయం, దారిద్య్ర భయం, అన్నపానీయ, ఆరోగ్య భయం కలలో కూడా తెలియనివ్వని శ్రీకృష్ణుని కరుణతో ఆనందంగా గడచిపోతోంది. అయితే, అది శ్రీకృష్ణుని గొప్ప తనం కంటే, తమ బలం అన్న ‘అహం’ ముందుకు వచ్చిన క్షణం నుంచి ద్వారక సముద్రంలో కొద్దికొద్దిగా లీనం కావడం మొదలు పెట్టింది. దైవం పట్ల, దైవశక్తులపట్ల అవిశ్వాసం, అవహేళన ప్రబలినవారి అహంకారం వారిలో వారికి వైరం కల్పించింది. శ్రీకృష్ణ నిర్యాణంతో ఆ అహంకారం పరాకాష్టకు జేరి ఆ వైరం పరస్పర బలప్రయోగంగా మారి వారిలో వారు యుద్ధాలు చేసుకుని మరణించారు. ద్వారక సముద్ర గర్భంలోకి చేరి ఒకనాటి చరిత్రకు సాక్షిభూతంగా నిలిచిపోయింది.

ఈనాడైనా, మరేనాడైనా ఏ యుగంలోనైనా కొన్ని నగరాలు, కొన్ని గ్రామాలు, కొన్ని పట్టణాలు, కొందరి గృహాలు పరిశీలించండి. పై చరిత్రను రుజువు చేస్తుంటాయి. పై సంఘటనలను పునరావృతం చేస్తుంటాయి.

ఎక్కడ దైవం, ధర్మం, ధర్మాచరణ పట్ల దీక్ష ఉంటుందో అదే వైకుంఠం, అదే ద్వారక, అదే బృందావనం, అదే కైలాసం, అదే అయోధ్య, అదే దేవలోకం, ఆ గుణాలను, ధర్మాలను ఆదరించి చూపే ఉన్నతుడైన మానవుడే మాధవుడు. రాముడు, ఈశ్వరుడు, అల్లా, క్రీస్తు అన్ని మతాల, క్షేత్రాల సారాంశం అదే. అవే నగరాలు, అవే క్షేత్రాలు, ఆ మానవులు స్వార్థాలకు, రాక్షసత్వాలకు, అహంకారానికి అలవాలమైనపుడు. అవే లంకానగరాలు, అదే చరిత్రకు సాక్షులుగా మిగిలే శిథిలాలు అవుతాయి.