News

తిరిగి అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి, జమిలి ఎన్నికలు నిర్వహిస్తాం : అమిత్ షా

65views

తాము తిరిగి అధికారంలోకి వస్తే దేశమంతటా ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. అలాగే ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్న దానిని కూడా అమలు చేస్తామని తెలిపారు. వీటికి సంబంధించిన బిల్లునూ పార్లమెంటులో ప్రవేశపెడతామని అన్నారు. పీటీఐ వార్త సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్‌షా ఈ విషయాలను వెల్లడిరచారు. దేశంలో ఏక కాల ఎన్నికలు నిర్వహించాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలకు మనం సిద్ధమైతే, ఎన్నికలను ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎండా కాలంలో కాకుండా శీతాకాల లేదా మరో సమయానికి మార్చే సాధ్యాసాధ్యాలపై కూడా ఆలోచిస్తామన్నారు. దీని ద్వారా ఖర్చులు కూడా తగ్గుతాయన్నారు.

యూసీసీ అనేది రాజ్యాంగ నిర్మాతలు స్వాతంత్రం సిద్ధించినప్పటి నుంచి మనకు, మన పార్లమెంట్‌కి, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు మిగిలిపోయిన బాధ్యత అని అన్నారు.రాజ్యాంగ సభ మనకు నిర్ణయించిన మార్గదర్శక సూత్రాలలో యూసీసీ కూడా వుందన్నారు. ఆ సమయంలోనే మున్షీ, రాజేంద్ర ప్రసాద్‌, అంబేద్కర్‌ వంటి న్యాయ పండితులు లౌకిక దేశంలో మత ఆధారిత చట్టాలు వుండకూడదని చెప్పారని అమిత్‌షా గుర్తు చేశారు. యూనిఫాం సివిల్‌ కోడ్‌ ఒక భారీ సామాజిక, చట్టపరమైన, మతపరమైన సంస్కరణ అని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు అమిత్‌షా తెలిపారు.