ArticlesNews

సనాతన ధర్మ పరిరక్షకులు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

107views

(మే 26 – పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి )

పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన రాసిన కాలజ్ఞానం. భవిష్యత్తుల్లో జరగబోయే అనేక విషయాలను ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచారు. ఆయన కేవలం కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి కాదు అంతకు మించి సంఘసంస్కర్త, హిందూ ధర్మ పరిరక్షకులు కూడా. బ్రహ్మంగారి తండ్రి పేరు పోతులూరి పరిపూర్ణయాచార్యులు, తల్లి పేరు పోతులూరి ప్రకృతాంబ. ఈ దంపతులకు క్రీస్తుశకం 1608లో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జన్మించారు. వీరిద్దరూ కాలం చేయడంతో విశ్వబ్రాహ్మణ పుణ్యదంపతులు యనమదల వీరభోజయాచార్యులు, వీరపాపమాంబ సంరక్షణలో బ్రహ్మంగారు పెరిగారు. తన 15వ ఏట కర్నూలు జిల్లా బనగానపల్లెకు చేరుకుని కాలజ్ఞానం రచించారు. అనంతరం వైఎస్ఆర్ కడప జిల్లాలోని కందిమల్లాయపల్లిలో సజీవ సమాధి అయ్యారు.

వీరబ్రహ్మంగారు జన్మించేనాటికి ఆంధ్రదేశం హిందూ ముస్లిం కలహాలతో, హిందువుల్లోని మూఢాచారాలతో కూరుకుపోయింది. పరమేశ్వరుని దృష్టిలో అందరూ సమానులేననేవి వీర బ్రహ్మంగారి సిద్ధాంతాలు. దీనికి నిదర్శనం ఆయన శిష్యులే. ప్రధాన శిష్యుడైన సిద్ధయ్య మహ్మదీయుడు, కక్కయ్య హరిజనుడు, అచ్చమాంబ రెడ్డికుల స్త్రీ, సర్వసమానత్వాన్ని సాధించే ఒక సామాజిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన ప్రయత్నించారు.

విపత్తులో మునిగిన హిందూ సమాజాన్ని రక్షించడానికి ఆ విధాత సృష్టించిన హిందూ ధర్మ రక్షా కవచమే శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. ఈ 2024వ సంవత్సరం మే 26న ఆయన జయంతిని నిర్వహించుకుంటున్నాము. ఈ సందర్భంగా సర్వ మానవ కల్యాణాన్ని ఆశించిన ఆ మహోన్నత వ్యక్తిని స్మరించుకుంటూ మనమందరం సమసమాజం బాటన నడవాలి.