ArticlesNews

అ‘ద్వితీయం’ కూర్మావతారం

101views

( మే 23 – కూర్మ జయంతి )

శ్రీమహావిష్ణువు ధరించిన ప్రసిద్ధ అవతారాలలోని అ’ద్వితీయం’ కూర్మావతారం. దేవదానవులు క్షీరసాగరంలో అమృత మథనానికి యత్నించినప్పుడు కవ్వమైన మంధర గిరి సాగరజలాల పాలుకాకుండా కాపాడేందుకు హరి కూర్మరూపుడిగా అవతరించాడు.

దానవుల చేతిలో పరాజితులైన దేవతలు మృత్యుభయ నివారణ, విజయసిద్ధికి శ్రీహరిని శరణు వేడారు. అమృతపానం కోసం క్షీరసాగరాన్ని మథించాలని హితవు చెప్పాడు దేవదేవుడు. కానీ ‘అది అత్యంత క్లిష్ట ప్రక్రియ. మథనానికి కవ్వం, తాడులాంటి సాధనాలు, కడలిని చిలికేందుకు తాడుకు ఇరువైపుల బలగం కావాలి. అది తమ వల్ల మాత్రమే సాధ్యం కాదు’ అనే ఆలోచనలో పడ్డారు సురలు. ఆయన ఆజ్ఞపై గరుడుడు, మంధరగిరిని కవ్వంగా సాగరతీరానికి చేర్చాడు. సర్పరాజు వాసుకి కవ్వపు తాడుగా నియుక్తుడయ్యాడు. దానవులు వాసుకి శిరోభాగం వైపు, దేవతలు తోకభాగంవైపు పట్టుకుని సాగర మథనం ప్రారంభించారు. అంతలో అదుపుతప్పిన మంధరం నీట మునుగుతుండడంతో శ్రీమహా విష్ణువు కూర్మరూపుడై గిరిని ధరించాడు. అది అటుఇటు ఊగకుండా గిరిశిఖరాన్ని వేయి చేతులతో పట్టుకున్నాడు.

ఆది శ్రీకూర్మం
యావత్ భారత దేశంలోనే ఏకైక కూర్మనాథాలయం ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదుల మధ్య వెలసింది. ఈ ఆది కూర్మ క్షేత్రం నెలవైన శాలిహుండం కొండను ‘కూర్మాద్రి’ అనీ వ్యవహరిస్తారు. ఈ క్షేత్రం గురించి పద్మ, బ్రహ్మ పురాణాలలో వర్ణితమైంది.ఈ ప్రాంతాన్ని ఏలిన శ్వేత చక్రవర్తి తపస్సుకు మెచ్చి కూర్మరూపంలో సాక్షాత్కరించిన విష్ణువు ఆ రూపంలోనే తనను అర్చించాలని చెప్పినట్లు, ఒక వటవృక్షం వద్ద చక్ర ప్రయోగంతో నిర్మించాడని, అదే చక్రతీర్థం, కూర్మగుండం, శ్వేతగుండం అనే పేర్లతో ప్రసిద్ధికెక్కిందని స్థలపురాణం.