News

భారత్‌కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్‌ చట్టసభ్యులు

230views

మానవ హక్కులపై భారత్‌కు పాఠాలు చెప్పడం ఏమాత్రం పనిచేయబోదని ఇండియన్‌ అమెరికన్‌ చట్టసభ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఇరు దేశాలు సుహృద్భావ వాతావరణంలో చర్చించుకోవడం మేలని సూచించారు. ఇతర దేశాలకు హితవు చెప్పేముందు అమెరికా వ్యవస్థలోని లోపాలనూ గమనించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ‘దేశీ డిసైడ్స్‌’ పేరిట నిర్వహించిన సదస్సులో వారు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్‌ వందల ఏళ్ల పాటు విదేశీ పాలనలో ఉంది. అలాంటి వారికి మానవ హక్కుల గురించి చెప్పడం హితబోధ చేసినట్లవుతుంది. వందల సంవత్సరాలుగా వలసవాద శక్తులు ఉపన్యాసాలు ఇస్తున్నాయని వారు (భారత్‌) స్పష్టంగా చెబుతున్నారు. అలాంటప్పుడు మన మాటలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వవు. ఇరు దేశాల్లోని లోపాలను గుర్తించి.. వాటిని కలిసికట్టుగా ఎలా పరిష్కరించుకోవాలి? తద్వారా ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కులను ఎలా కాపాడుకోవాలి? అనే ధోరణిలో చర్చించుకుంటే మేలు’’ అని కాంగ్రెస్‌ సభ్యుడు రో ఖన్నా అన్నారు.

ప్రజాస్వామ్యంలో పత్రికాస్వేచ్ఛ, బలమైన ప్రతిపక్షం ఉండాలని మరో భారత సంతతి చట్టసభ సభ్యుడు అమీ బేరా తెలిపారు. మరోవైపు అమెరికా వ్యవస్థలోని పరిమితులనూ లేవనెత్తాల్సిన అవసరం ఉందని మరో సభ్యురాలు ప్రమీలా జయపాల్‌ అభిప్రాయపడ్డారు. అప్పుడే ఇతర దేశాల్లోని లోపాల గురించీ మాట్లాడొచ్చని అన్నారు. ఇండియా-యూఎస్‌ మైత్రి మరింత బలపడాల్సిన అవసరం ఉందని మరో సభ్యుడు థానేదార్‌ తెలిపారు. రష్యాను విడిచిపెట్టి భారత్‌ పూర్తిగా అమెరికాతో బంధాన్ని బలపర్చుకోవాలని హితవు పలికారు. చైనాకు చెక్‌ పెట్టేందుకు భారత్‌ ఒక్కటే పరిష్కారమని అభిప్రాయపడ్డారు.