News

రామమందిర విరాళాల వ్యవహారంపై ఆర్‌ఎస్‌ఎస్ స్పందన..

28views

అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిరంలోని విరాళాల వ్యవహారానికి సంబంధించి వెలుగులోకి వచ్చిన ఆరోపణలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) స్పందించింది. ఈ ఘటన కోట్లాది మంది రామభక్తుల మనోభావాలను దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేసిన సంఘ్, దర్యాప్తులో దోషులుగా తేలిన వారిపై ఎలాంటి ఉపేక్ష లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

ఆర్‌ఎస్‌ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే విడుదల చేసిన ప్రకటనలో, తరతరాల పోరాటం, అనేక మంది భక్తుల త్యాగం, అంకితభావం ఫలితంగానే శ్రీరామ జన్మభూమిపై భవ్యమైన మందిరం నిర్మితమైందని పేర్కొన్నారు. ఈ ఆలయం యావత్ హిందూ సమాజానికి భక్తి, విశ్వాసం, ఆరాధనకు కేంద్రబిందువుగా నిలిచిందని తెలిపారు. అలాంటి పవిత్రమైన ఆలయంలో భక్తులు సమర్పించిన విరాళాలకు సంబంధించిన దొంగతనం ఆరోపణలు అత్యంత దురదృష్టకరమని, ఇవి రామభక్తుల విశ్వాసాన్ని తీవ్రంగా కలిచివేశాయని అన్నారు.

ఈ వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్‌ఐటీ)ను ఏర్పాటు చేయడాన్ని స్వాగతించిన హోసబాలే, సమగ్ర దర్యాప్తు నిర్వహించి వాస్తవాలను వెలికితీయాలని కోరారు. దర్యాప్తులో ఎవరు దోషులుగా తేలినా వారికి చట్టప్రకారం కఠిన శిక్షలు విధించాలని స్పష్టం చేశారు.

రామమందిరానికి భక్తులు సమర్పించే విరాళాలు కేవలం ఆర్థిక విలువ కలిగినవి మాత్రమే కాకుండా వారి అపారమైన భక్తి, విశ్వాసానికి ప్రతీకలని పేర్కొన్న సంఘ్, ఇటువంటి తీవ్రమైన ఘటనను తేలికగా తీసుకునే ప్రసక్తే లేదని వెల్లడించింది. ఆలయ నిర్వహణలో ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని వెంటనే సరిదిద్దాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది.

ప్రస్తుతం ఈ అంశంపై భక్తుల్లో అనేక సందేహాలు, ఆందోళనలు నెలకొన్నాయని పేర్కొన్న ఆర్‌ఎస్‌ఎస్, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఆలయ యాజమాన్యం, ప్రత్యేక దర్యాప్తు బృందంపైనే ఉందని తెలిపింది. ఆలయ ఆర్థిక వ్యవహారాల్లో సంపూర్ణ పారదర్శకత, సమర్థవంతమైన నిర్వహణ, మతపరమైన పవిత్రతను కాపాడితేనే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రంపై కోట్లాది మంది భక్తుల విశ్వాసం మరింత బలపడుతుందని సంఘ్ తన ప్రకటనలో విశ్వాసం వ్యక్తం చేసింది.