భారత ప్రధాని నరేంద్ర మోదీ చాలా బలమైన నాయకుడని పాకిస్థానీ-అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ అన్నారు. దేశాన్ని ఆయన సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లారని కొనియాడారు. మూడోసారీ మోదీయే అధికారంలోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘మోదీ అద్భుతమైన నాయకుడు. పుట్టుకతోనే లీడర్. ఆయన నాయకత్వం కేవలం భారత్‌కే కాదు.. మొత్తం ప్రపంచానికీ మంచి చేస్తుంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ పాకిస్థాన్‌లో పర్యటించి, తన రాజకీయ భవితవ్యాన్ని పణంగా పెట్టిన ఏకైక ప్రధాని. మాకూ అలాంటి నాయకుడు రావాలని ఆశిస్తున్నాం. పాకిస్థాన్‌తో చర్చలు జరిపి వాణిజ్యం ప్రారంభిస్తారని అనుకుంటున్నాం. శాంతియుత వాతావరణం ఇరుదేశాలకూ మంచిది’’ అని తరార్ అన్నారు.
పీవోకే నిరసనలకు కారణమిదే..
పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోందని తరార్ గుర్తుచేశారు. ఇది పాక్ ఆక్రమిత కశ్మీర్ సహా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సామాజిక అస్థిరతకు దారితీసిందని తెలిపారు. విద్యుత్తు బిల్లులు పెరగడమే పీవోకేలో నిరసనలకు ప్రధాన కారణమని వెల్లడించారు. పీవోకేకు ఆర్థిక సాయం అందజేయాలన్న పాక్ ప్రధాని నిర్ణయాన్ని తరార్ ప్రశ్నించారు. డబ్బు ఎక్కడి నుంచి వస్తోందని నిలదీశారు.
‘‘పాక్‌లో సమస్యల్ని ఎలా పరిష్కరించాలనే దానిపై ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. ఉగ్రవాదాన్ని ఎలా అదుపులోకి తేవాలి? శాంతి భద్రతలను ఎలా మెరుగుపర్చాలి? పీవోకేలో అస్థిరత కొనసాగుతోంది. అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈ సమస్యలన్నింటి నుంచి గట్టెక్కించే నాయకొడకరు రావాలని ఆశిస్తున్నాం’’ అని తరార్ అన్నారు.





