News

12 వేల మందికి అమరనాథ్‌ తొలి దర్శనం

3views

కట్టుదిట్టమైన భద్రత… వాతావరణ అవాంతరాల మధ్య … హర హర మహాదేవ్‌ అంటూ… బయల్దేరిన భక్తులకు ఈ ఏడాది అమరనాథ్‌ మంచుశివలింగ తొలి దర్శనమైంది. అమరనాథ్‌యాత్రలో భాగంగా శుక్రవారం తొలిరోజు 12 వేల మంది భక్తులు మంచులింగాన్ని దర్శించుకున్నారు. జమ్మూకశ్మీర్‌లోని హిమాలయాల్లో ఏటా ఈ సమయంలో ఏర్పడే మంచు లింగాన్ని పూజించేందుకు గురు, శుక్రవారాల్లో నువ్వాన్, బాల్‌టాల్‌ బేస్‌ క్యాంపుల నుంచి రెండు బృందాలు బయలుదేరాయి. దర్శనం చేసుకున్నవారిలో 9,350 మంది పురుషులు, 2,250 మంది మహిళలు, 200 మంది పిల్లలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

అమరనాథ్‌ భక్తులకు ప్రధాని మోదీ లేఖ
యాత్ర మొదలైన నేపథ్యంలో భక్తులకు ప్రధాని మోదీ ‘ఎక్స్‌’ వేదికగా రెండు పేజీల లేఖ రాశారు. ఈ సందర్భంగా అయిదు ప్రతిజ్ఞలు చేయాలంటూ వారికి సూచించారు. పరిశుభ్రత పాటించటం.. జమ్మూకశ్మీర్‌లోని స్థానిక ఉత్పత్తులకు (వోకల్‌ ఫర్‌ లోకల్‌) ప్రాధాన్యం.. ట్రాఫిక్‌ నిబంధనలు.. పచ్చదనాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రక్షాబంధన్‌ రోజు తోబుట్టువులకు బహుమతిగా మొక్కలు.. దేశం ప్రథమం అనే నినాదంతో అమరనాథ్‌ యాత్రను సాగించాలని భక్తులను ప్రధాని కోరారు.