పాక్ ఆక్రమిత కశ్మీర్ హింసతో దద్దరిల్లిపోతోంది.అవామీ యాక్షన్ కమిటీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సోమవారం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో జరిగిన ఆందోళనకారులపై సైన్యం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు చనిపోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం జరిగిన అల్లర్లలో ఒక పోలీసు అధికారి సహా మరికొందరు పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో వ్యాపారాలు పూర్తిగా మూతపడ్డాయి. శనివారం ఆందోళనకారులను అదుపు చేయడానికి భద్రతా దళాలు ఒక దశలో ఏకే-47తో కాల్పులు జరపాల్సి వచ్చింది. తక్షణమే ఇక్కడి పరిస్థితిని అదుపు చేయడానికి ప్రభుత్వం 2,300 కోట్ల పాకిస్థానీ రూపాయిలను విడుదల చేసినా.. పరిస్థితి అదుపులోకి రావడంలేదు.
స్థానిక మంగ్లా డ్యామ్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును తమకు ఉచితంగా ఇవ్వాలని స్థానికులు బలంగా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. గోధుమలపై రాయితీలు కల్పించాలని కోరుతున్నారు. ఈ ప్రాంతంలో ద్రవ్యోల్బణం అత్యంత తీవ్ర స్థాయికి చేరింది. ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో స్థానిక ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేశారు. వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది.