కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో తిరిగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం శుక్రవారం రాత్రి చెన్నై వాసులను కనువిందు చేసింది. నిశీధిలో మిలమిలా మెరుస్తూ కన్పించడంతో ప్రజలు ఆశ్చర్యపడ్డారు. కొందరు ఆ అరుదైన దృశ్యాలను కెమెరాలో బంధించి నెట్టింట పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
మే 8 నుంచి 23వ తేదీ మధ్యలో భారత్‌లోని పలు నగరాల ప్రజలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమి నుంచి కన్పిస్తుందని ఇటీవల నాసా వెల్లడించింది. ‘‘ప్రస్తుతం సూర్యుడి కాంతి దీని మీద ప్రతిబింబించడంతో ఈ స్పేస్ స్టేషన్ భారత వాసులకు కన్పించనుంది. సాధారణంగా చంద్రుడు కూడా మనకు ఇలాగే కన్పిస్తాడు. అయితే, జాబిల్లి అంత ప్రకాశవంతంగా ఉండకపోవడంతో పగటిపూట అంతరిక్ష కేంద్రాన్ని భూమిపై నుంచి మనం గుర్తించలేం. అదే రాత్రివేళల్లో అయితే మెరుస్తూ కన్పిస్తుంది. కొన్ని వారాల పాటు ఇది పలు నగరాల్లో దర్శనమివ్వనుంది’’ అని నాసా పేర్కొంది.
ఈ క్రమంలోనే చెన్నైలో శుక్రవారం రాత్రి 7 గంటలకు కొన్ని నిమిషాల పాటు ఇది కనువిందు చేసింది. మిలమిలా మెరుస్తూ వేగంగా ప్రయాణిస్తూ కన్పించింది. మే 14 వరకు పలు సమయాల్లో మళ్లీ ఈ స్పేస్ స్టేషన్‌ను చూడొచ్చని అంతరిక్ష రంగ నిపుణులు చెబుతున్నారు. నేటి నుంచి ముంబయి, దిల్లీ, బెంగళూరు ప్రాంతాల్లోనూ ఈ దృశ్యం కన్పించనుంది.





