News

అయోధ్య మందిరం వాస్తు ప్రకారం లేదు; ఎస్పీ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్య

5.4kviews

అయోధ్య రామమందిరంపై సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రాంగోపాల్‌ యాదవ్‌ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆలయాన్ని సరిగా నిర్మించలేదని, అది ఉపయోగం లేనిదని ఆయన అన్నారు. ‘అసలు ఆలయాలను కట్టేది ఇలాగేనా? ఓసారి పురాతన ఆలయాలను చూడండి. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు ఎక్కడా ఇలా నిర్మించలేదు. వాస్తుప్రకారం చూసినా ఈ నిర్మాణం సరిగా లేదు. ప్రణాళికే బాగాలేదు’ అని యాదవ్‌ ఓ టీవీ ఛానల్‌కు వివరించారు. విపక్ష నేతలు అయోధ్యలో నూతన రామాలయానికి ఎందుకు వెళ్లలేదన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. తాము శ్రీరాముడికి ప్రతిరోజూ దండం పెట్టుకుంటామని చెప్పారు. సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌, ఇండియా కూటమి అసలు స్వరూపమేమిటో రాంగోపాల్‌ ప్రకటన చాటుతోందని యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ మండిపడ్డారు. ‘ఓటుబ్యాంకు కోసం ఇలాంటివారు దేశ విశ్వాసాలతో ఆడుకుంటున్నారు. శ్రీరాముడి అస్తిత్వాన్ని సవాల్‌ చేస్తున్నారు. ఇలా చేసినవారికి ఎలాంటి గతి పడుతుందో చరిత్రే సాక్ష్యం’ అని చెప్పారు.