అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 10వ తేదీన సింహాద్రి అప్పన్న చందనోత్సవం వైభవోపేతంగా జరగనుంది. స్వామివారి నిజరూప దర్శన టికెట్ల విక్రయం శుక్రవారం సాయంత్రం 4గంటల నుంచి ప్రారంభించనున్నట్లు ఈవో సింగల శ్రీనివాసమూర్తి తెలిపారు. దేవస్థానంలో కౌంటర్లతో పాటు నగరంలోని పలు బ్యాంకు శాఖల ద్వారా వీటిని అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రూ.300, రూ.వెయ్యి టికెట్లు బ్యాంకుల ద్వారా, సింహగిరిపై పాత పీఆర్‌వో కార్యాలయం వద్ద లభ్యమవుతాయన్నారు. టికెట్లు కావాల్సిన భక్తులు ఆధార్ వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒక దరఖాస్తుపై నాలుగు టికెట్లు మాత్రమే జారీ చేస్తామన్నారు. 7వ తేదీ సాయంత్రం 5గంటల తర్వాత ఈ టికెట్ల విక్రయం నిలిపివేస్తామని, 10వ తేదీన చందనోత్సవం రోజున కూడా భక్తులకు దర్శనం టికెట్లు లభించవని తెలిపారు. ఈ టికెట్లు లేని భక్తులను ఉచిత దర్శనం క్యూలైన్ల ద్వారా మాత్రమే అనుమతిస్తామన్నారు. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
ఆన్‌లైన్‌లో..: శుక్రవారం సాయంత్రం 4గంటల నుంచి రూ.300, రూ.వెయ్యి, రూ.1500 టికెట్లు ఆన్‌లైన్‌లో లభిస్తాయని, ఇవి ఈ నెల 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఈవో పేర్కొన్నారు. www.aptemples.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా వీటిని పొందవచ్చన్నారు. చందనోత్సవం రోజున జరిగే పరోక్ష సేవ టికెట్లు కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు.
టికెట్ల విక్రయ కేంద్రాలు
యూనియన్ బ్యాంకు – సింహాచలం, మహారాణిపేట, అక్కయ్యపాలెం శాఖలు
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా – సింహాచలం, సాలిగ్రామపురం (అక్కయ్యపాలెం), బిర్లా జంక్షన్ శాఖలు
సింహగిరిపై – పాత పీఆర్‌వో కార్యాలయం వద్ద..





