News

తమిళనాడు వక్ఫ్ చట్టం సవరణ రాజ్యాంగవిరుద్ధమన్న మద్రాస్ హైకోర్ట్

548views

తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకె ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. 1995 నాటి వక్ఫ్ బోర్డ్ చట్టానికి చేసిన తమిళనాడు ప్రభుత్వం సవరణను మద్రాస్ హైకోర్ట్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది.

వక్ఫ్ భూములను ఆక్రమించుకునే వారిని ఖాళీ చేయించే అధికారాలను వక్ఫ్ బోర్డ్ సిఇఓకు కట్టబెడుతూ డిఎంకె సర్కారు చేసిన చట్టం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని హైకోర్టు తేల్చిచెప్పింది. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన వక్ఫ్ చట్టం 1995 కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టం. దాన్ని 2010లో అప్పటి డిఎంకె ప్రభుత్వం సవరించింది. తమ రాష్ట్రంలోని వక్ఫ్ భూములను తమిళనాడు పబ్లిక్ ప్రెమిసెస్ (ఎవిక్షన్ ఆఫ్ అనాథరైజ్డ్ ఆక్యుపెంట్స్) చట్టం 1976 పరిధిలోకి తీసుకొచ్చింది. తద్వారా వక్ఫ్ భూములను ఆక్రమించుకుని నివసిస్తున్న వారిని ఖాళీ చేయించే అధికారం వక్ఫ్ బోర్డ్ సిఇఒకు దఖలు పరిచింది.

వక్ఫ్ చట్టం 1995కు డిఎంకె ప్రభుత్వం 2010లో చేసిన ఆ సవరణ రాజ్యాంగ విరుద్ధమని మద్రాస్ హైకోర్టులో చీఫ్ జస్టిస్ వి గంగాపూర్‌వాలా, జస్టిస్ భారత చక్రవర్తితో కూడిన ద్విసభ్య ధర్మాసనం తాజాగా ఏప్రిల్ 24న ప్రకటించింది. వక్ఫ్ ఆస్తులను ఆక్రమించుకున్న వారిని ఖాళీ చేయించే అధికారం కేంద్ర చట్టానికి 2013లో చేసిన సవరణ ప్రకారం ఏర్పాటు చేసిన వక్ఫ్ ట్రైబ్యునల్స్‌కు మాత్రమే ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్ర చట్టాలు వాటికంటె ముందు చేసిన కేంద్ర చట్టాలను ధిక్కరించలేవన్న న్యాయసూత్రాన్ని గుర్తుచేసింది.