
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా ప్రజలు ఎక్కువగా పూజించే ఆరాధ్యదైవం శ్రీదుర్గాపరమేశ్వరి అమ్మవారు. మంగళూరులోని కటీల్ శ్రీదుర్గాపరమేశ్వరి ఆలయ వార్షిక జాతర మహోత్సవాలు శనివారం రాత్రి ఘనంగా జరిగాయి. అయితే ఈ సందర్భంగా రాత్రి ఆలయం ఎదురుగా ఉన్న రథబీడి వద్ద సంప్రదాయ తుతేదర ఉత్సవం వైభవంగా నిర్వహించారు.
ఈ నేపథ్యంలో భక్తులు నిర్వహించే అగ్నికేళి చూపరుల్లో ఉత్సాహాన్ని నింపింది. వ్రత నియమావళికి వచ్చిన భక్తుల బృందం కొబ్బరి ఈకలతో చేసిన తాటాకులను వెలిగించి ఒకరిపై ఒకరు విసురుకున్నారు. ఏటా ఈ జాతర ఏప్రిల్‌లో ఎనిమిది రోజులు పాటు జరుగుతుంది. అగ్నికేళిలో పాల్గొనే భక్తులు ఒకరికొకరు సుమారు 15 మీటర్ల దూరంలో ఎదురెదురుగా నిలబడతారు. కొబ్బరి ఈకలతో చేసిన తాటాకులను వెలిగించి ఒకరిపై ఒకరు విసురుకుంటారు. రాత్రి సమయంలో ఇలా అగ్ని కేళిలో పాల్గొన్న భక్తులతో ఆలయ ప్రాంగణం యుద్ధ వాతావారణాన్ని తలపిస్తుంది.
#WATCH | Karnataka: Devotees throw burning palm fronds at each other as part of the annual festival 'Thootedhara' or 'Agni Keli' at the Kateel Sri Durgaparameshwari Temple in Mangaluru. pic.twitter.com/EtoEkI2YoF
— ANI (@ANI) April 21, 2024
అగ్ని కేళి పోటీ సుమారు 15 నిమిషాలు పాటు జరుగుతుంది. తెల్లటి దుస్తులు ధరించిన నిర్వాకులు.. అగ్ని కేళిలో పాల్గొని గాయాలు తగిలిన వారికి పవిత్ర జలంతో ప్రాథమిక చికిత్స అందిస్తారు. వందలాది మంది గుంపులుగా చేరి విసురుకున్న ఈ దృశ్యం వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
యుద్ధ సమయంలో దుర్గామాత సింహం లేదా పులిపై స్వారీ చేస్తూ ఆయుధాలు ధరించి రాక్షసులతో భీకరంగా పోరాడుతారు. అయితే ఈ అగ్ని కేళి ఉత్సవం అమ్మవారిని శాంతింప చేస్తుందని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. అయితే దర్గామాత శక్తి, ధైర్యానికి గుర్తుగా ఈ ఉత్సవాన్ని దక్షిణ కన్నడ జిల్లా ప్రజలు ఘనంగా జరుపుతుంటారు.





