News

మే 18 నుంచి సత్యదేవుని కల్యాణ మహోత్సవాలు

249views

అన్నవరం రత్నగిరిపై కొలువైన వీర వేంకట సత్యనారాయణస్వామి, అనంతలక్ష్మి, సత్యవతీదేవి అమ్మవార్ల దివ్య కల్యాణ మహోత్సవాలు మే 18 నుంచి 24వ తేదీ వరకూ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మే 19వ తేదీ రాత్రి 9.30 గంటల నుంచి స్వామివారి దివ్య కల్యాణం జరుగుతుంది. ఈ ఉత్సవాల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని దేవస్థానం ఈఓ కె.రామచంద్రమోహన్‌ అధికారులను ఆదేశించారు. ఆయన బుధవారం దేవస్థానం పండితులు, ఇతర అధికారులతో సమావేశమై కల్యాణ మహోత్సవాల ఏర్పాట్లపై చర్చించారు. వివిధ విభాగాల వారీగా చేయాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు. స్వామివారి దివ్య కల్యాణ మహోత్సవాన్ని రామాలయం వద్ద గల వార్షిక కల్యాణ మంటపంలో నిర్వహించాలని తీర్మానించారు. అలాగే ఉత్సవాలలో చివరి రోజు మే 24న జరిగే శ్రీపుష్పయాగాన్ని స్వామివారి ఆలయానికి ఈశాన్య భాగంలో గల నిత్య కల్యాణ మండపంలో చేయాలని నిర్ణయించారు. గతేడాది శ్రీపుష్పయాగం కార్యక్రమాన్ని వార్షిక కల్యాణ మండపంలో నిర్వహించడాన్ని వేద పండితులు తప్పు పట్టడంతో వివాదాస్పదమైంది. ఈ ఏడాది మాత్రం ఎప్పటిలాగానే శ్రీపుష్పయాగాన్ని నిత్యకల్యాణ మండపంలో నిర్వహించనున్నట్టు ఈఓ రామచంద్ర మోహన్‌ తెలిపారు.