
మచిలీపట్నం రైల్వేస్టేషన్ నుంచి బందరుకోట రోడ్డు మీదుగా ఊళ్ళోకి వస్తూవుంటే మల్కాపట్టణం జంక్షన్ వద్ద ఒక మామూలు భవనంలో ఒక హైస్కూలు కన్పిస్తుంది. ప్రత్యేక ఆకర్షణగాని, ఆర్బాటాలుగాని లేని ఆ హైస్కూలుకు అపూర్వమైన చరిత్ర వుందనికానీ, దాని కోసం ఒక మహనీయుడు నిర్విరామంగా అకుంఠిత దీక్షతో తన సర్వస్వం త్యాగం చేశాడన్న విషయం కానీ చాలామందికి తెలియదు. ఆంధ్రదేశంలో హరిజనోద్ధరణకు కృషిచేసిన అనేకమంది మహనీయులలో అగ్రేసరులు శ్రీ వేమూరి రాంజీరావు పంతులుగారు.
రాంజీరావుగారు పరమ నిష్టాగరిష్ఠులైన సాంప్రదాయిక వైదిక కుటుంబంలో 3-5-18915 3వ తేదీన శ్రీ పద్మనాభరావు గారు, రావమ్మల చివరి సంతానంగా ఆర్మించారు. ఆయన హరిజన ప్రగతికి తన జీవితాన్ని అంకితం చేశారు. పెళ్ళిచేసుకుని కూడా హరిజనోద్ధరణా దీక్షను పూని ఆజన్మాంతమూ బ్రహ్మచర్యాన్ని అవలంబించి సంసార సుఖాలను వదలుకున్నారు. సాంఘికంగా వెలికి గురిఅయ్యారు. తనకు పిల్లలు లేకపోయినా సమాజంలో అనాదరణకు, అవమానాలకు గురైన హరిజన పిల్లలందరినీ తన పిల్లలుగా భావించి ఆదరించారు. అంటరానివాడని ఆలయంలోకి అనుమతించని తన భక్తుడు నందనార్ వద్దకు, సాక్షాత్తూ ఆ పరమశివుడే గర్భగుడి దాటివచ్చి, దర్శనమిచ్చి, తనలో ఐక్యం చేసుకున్న వృత్తాంతం, స్వామి వివేకానంద, రఘుపతి వెంకటరత్నం నాయుడు ప్రభృతుల ప్రభావం ఆయనపై పడింది.
సమాజంలో ఆనాడు అస్పృశ్యులు అనబడేవారు ఎంత నీచంగా చూడబడ్తున్నారో! ఆర్థికంగా, సాంఘికంగా, విద్యావిషయకంగా ఎంతగా వెనుకబడివున్నారో రాంజీరావుగారు గ్రహించారు. ఈ దీనజనుల సేవే మాధవసేవగా తన మోక్షమార్గంగా భావించి అందుకై తన యావత్తు జీవితాన్నీ ధారవోశారు. సమాజంలో ఏ వర్గమయినా ప్రగతి సాధించాలంటే వారు విద్యావంతులు కావడం అవసరమని రాంజీరావు గుర్తించి, హరిజనులలో విద్యావ్యాప్తికి నడుం కట్టారు. 1914లో బందరు మిస్తాఖాన్ పేటలో చిన్న వయస్సులోనే ఒక రాత్రి పాఠశాలను ఏర్పర్చారు. 1916 పాటికి అది పూర్తిస్థాయి పాఠశాల అయింది. వీటి నిర్వహణ కొరకై నిధుల కొరకు 1924లో రంగూన్ పర్యటించారు. అది అంచెలంచెలుగా పెరిగి పూర్తిస్థాయి హైస్కూలుగా పెరిగి రాష్ట్రంలోని ఉత్తమ పాఠశాలల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఆ పాఠశాలతోపాటు హరిజన బాలబాలికలకు వసతిగృహాలు ఏర్పాటు చేశారు.
రాంజీరావు పంతులుగారు, స్థాపించిన ఈ పాఠశాల వసతి గృహము మాజీ మంత్రి శ్రీ వేముల కూర్మయ్య, గోవాడ నిరీక్షణ రావు, గంజి రామారావు, గుంటూరు బాపనయ్య, ముత్యాల వేంకటేశ్వరావు, శ్రీ జె. రాజారావు, గోవాడ వెంకటేశ్వరరావు, శ్రీ కె. మాధవరావు, దమ్ము రామకృష్ణయ్య, శ్రీ కమలేశ్వరరావు, శ్రీ మంగళగిరి ప్లీడర్లుగా, ఐ.ఏ.యస్, ఆఫీసర్లు, తయా మంత్రులుగా, ఇంజనీరుగా, స్టండి. . ప్లీడర్లుగా, ఐ.ఎ.యస్., ఐ.పి.యస్. ఆఫీసర్లుగా తయారు కావటానికి పునాదులు వేసింది. హరిజనోద్ధరణ ప్రత్యేక విషయంగా స్వీకరించి, “దీనబంధు” అనే పత్రిక నడిపి దీనజనుల బాధలపై అందరికీ అవగాహన కలిగించారు.
1929 మహాత్మాగాంధీ ఆంధ్ర పర్యటన సందర్భంగా మచిలీపట్టణం ఆయన వచ్చినప్పుడు. రాంజీరావుగారిని ప్రత్యేకంగా కలుసుకుని కౌగిలించుకుని ఆశీర్వదించారు. ఎస్.సి. బాలికల కోసం అరుందతీ ఆశ్రమం (బాలికల వసతి గృహం) గాంధీచే ప్రారంభింపబడింది. తన ఉద్యమం కోసం రాంజీరావు ఆనాడే ఉమ్మడి మద్రాసు రాష్ట్రమంతటా పర్యటించి విరాళాలు సేకరించేవారు.
ఆయన స్థాపించిన పాఠశాలలో మరొక ప్రత్యేకత వుంది. కేవలం చదువు వలన ప్రయోజనం ఉండదని, ఉదరపోషణకు మరొకరిమీద ఆధారపడకుండా ఏదో వృత్తి తెలిసి వుండాలని భావించారు. అందువలన నేత, వడ్రంగం, తోలు పనులు, టైలరింగ్లో శిక్షణ యిచ్చేవారు. విద్యార్థులను ఎంత ఆప్యాయంగా ఆపేక్షగా చూచుకునేవారో. క్రమశిక్షణ విషయంలో అంత కఠినంగా వుండేవారు. పిల్లలందరూ శ్రీ రాంజీరావుగారిలో ఒక తండ్రిని చూచుకునేవారు.
రాంజీరావుగారి కృషిని గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం బంగారు పతకాలతో సత్కరించింది. ఐతే బ్రిటిష్ ప్రభుత్వం మహాత్మగాంధీని అరెస్ట్ చేసినందుకు నిరసనగా ఆయన తన బిరుదును వాపసుచేశారు. మద్రాస్ రాష్ట్రప్రభుత్వం ఆయనను మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిలుకు నామినేటు చేసింది. రాంజీరావుగారు వయోజన విద్య, గ్రంథాలయోద్యమాల వ్యాప్తికి విశేష కృషి చేశారు. రాంజీరావుగారు 1963 జూన్ 3న తన 72వ ఏట పరమపదించారు.



