News

వైభవంగా సత్యదేవుని ఆలయ వార్షికోత్సవం

286views

భక్తవరదుడైన అన్నవరం సత్యదేవుని నూతన ఆలయ పునర్నిర్మాణం, శిఖర ప్రతిష్ఠ జరిగి, పుష్కర కాలం (12 సంవత్సరాలు) పూర్తయిన సందర్భంగా రత్నగిరిపై సోమవారం 13వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున సత్యదేవుడు, దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి, శంకరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కదంబం ప్రసాదాలు నివేదించి, భక్తులకు పంపిణీ చేశారు. వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి ఆలయాన్ని, ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.

ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర దేవదాయ, ధర్మదాయ శాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ మాట్లాడుతూ, సత్యదేవుని నూతన ఆలయ శిఖరానికి దాతల సహకారంతో స్వర్ణ రేకు తాపడం చేయించేందుకు త్వరలోనే అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు. దీనికి 11.5 కిలోల బంగారం అవసరమవుతుందని, దీనికి సుమారు రూ.7.5 కోట్ల వ్యయమవుతుందని చెప్పారు. ఈ మేరకు దేవస్థానం అధికారులు నివేదిక పంపారని తెలిపారు. దీనిపై టీటీడీ నిపుణుల నివేదిక కోరామని, అది వచ్చిన వెంటనే అనుమతి మంజూరు చేస్తామని వివరించారు.

దేవస్థానం ఈఓ కె.రామచంద్ర మోహన్‌ మాట్లాడుతూ, తాను 2010లో ఇక్కడకు ఈఓగా వచ్చినప్పుడు శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని చూసి ఆవేదన చెందానన్నారు. దీనిని పునర్నిర్మించాలనుకున్నానని, అయితే కొంత మంది వ్యతిరేకించడంతో శృంగేరి పీఠాధిపతి జగద్గురు భారతీతీర్థ స్వామి వారిని కలిసి పరిస్థితి వివరించానని చెప్పారు. స్వామి, అమ్మవారు, శంకరుల మూలవిరాట్టులను కదపకుండా ఆలయ పునర్నిర్మాణం చేపట్టాల్సిందిగా నాడు స్వామీజీ ఆదేశించారని తెలిపారు. ఆ మేరకు మూలవిరాట్టులకు పటిష్ట రక్షణ ఏర్పాట్లు చేసి, 2011లో నూతన ఆలయ నిర్మాణం ప్రారంభించి, ఏడాది లోగా పూర్తి చేశామని చెప్పారు. నూతన ఆలయ శిఖరంపై 2012 మార్చి 14న ఫాల్గుణ బహుళ సప్తమి నాడు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారి చేతుల మీదుగా కలశ స్థాపన చేసి, ఆలయాన్ని ప్రారంభించామని తెలిపారు. 13వ వార్షికోత్సవం జరిపే అవకాశం తనకు కలగడం సంతోషంగా ఉందని ఈఓ చెప్పారు.

నాడు నూతనాలయ శిఖర ప్రతిష్ఠలో పాల్గొన్న ఐదుగురు పండితులను కమిషనర్‌ సత్యనారాయణ, ఈఓ రామచంద్ర మోహన్‌ ఘనంగా సత్కరించారు.