ArticlesNews

వినూత్న తరహాలో సంస్కృత ప్రచారం చేస్తున్న యువతి

407views

చాలామంది సంస్కృతం ఒక మతానికి, దాని ధర్మాలకు సంబంధించిన భాష అని అనుకుంటారు. ఆ మూసని ఛేదించి, మామూలు సంభాషణలకు సైతం వాడుకోగల భాష సంస్కృతం అని యువతరానికి తెలియజేస్తున్నారు బెంగళూరుకు చెందిన 23 ఏళ్ల యువతి సమష్ఠి గుబ్బి. బెంగళూరులోని వైవిధ్యభరితమైన భోజనశాలలను ప్రపంచానికి సంస్కృతంలో పరిచయం చేస్తూ ప్రాచీన భాషకు, ఆధునిక ప్రపంచానికి మధ్య దూరాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు.

చేతిలో స్మార్ట్‌ఫోన్, అందులో ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక వీడియోలు తీసి వ్లాగ్‌లు పెట్టడం ఊపందుకుంది. దాదాపు అందరూ తమ మాతృభాషలోనో, హిందీ లేదా ఇంగ్లీషులోనో వ్లాగ్‌లు చేస్తుంటారు. కానీ బెంగళూరుకు చెందిన 23ఏళ్ళ యువతి సమష్ఠి గుబ్బి సంస్కృతంలో వ్లాగ్‌లు చేస్తోంది.

జనని సంస్కృతంబు సకల భాషలకును అని ప్రగాఢంగా విశ్వసించే యువతి సమష్ఠి. ఆమెకు దేవభాష అంటే ఎంతో ప్రేమ. కర్ణాటకలోని హొన్నవర్ నది ఒడ్డున బాల్యం గడిపిన నాటినుంచే సంస్కృతం నేర్చుకుంది. ఆ భాషలో పీజీ కూడా పూర్తి చేసింది. ఇప్పుడు దాన్ని సమాజంలోని అందరికీ చేరువ చేసే ప్రయత్నం చేస్తోంది.

‘‘సమాజంలోని అన్ని వర్గాలకూ ఆ భాషను చేరువ చేయాలన్నదే నా ఉద్దేశం. ఆ క్రమంలో మొదట్లో సంస్కృతవిద్యా బోధనకు ఒక వెబ్‌సైట్ ప్రారంభించాం. విభిన్నమైన వృత్తివ్యాపారాల్లో ఉన్నవారందరికీ సంస్కృతం సులువుగా అందుబాటులోకి తెచ్చాం. దానికోసం మూసధోరణులను దాటి వినూత్నమైన, ఆధునికమైన ప్రయత్నాలన్నీ చేసాం. మారథాన్స్ నిర్వహించాము. మ్యూజికల్ బ్యాండ్స్ ఏర్పాటు చేసాము. కార్పొరేట్ సంస్థలు, ఔత్సాహిక క్రీడాకారులు, సంగీత కళాకారులు వంటివారిని భాగస్వాములను చేసుకున్నాం.’’ అంటూ తమ ప్రయత్నాల గురించి వివరించింది.

ఆ క్రమంలో సమష్ఠి ఒక విషయం అర్ధం చేసుకుంది. సంస్కృతాన్ని యువతరానికి నచ్చేలా చేస్తేనే దాన్ని వ్యాపింపజేయడం సాధ్యం. ఆ భాషను రోజూ మాట్లాడుకునే వాడుకభాషగా ఉపయోగించవచ్చునని ఆమె నమ్మకం. అందుకే, ఆ ప్రాచీన భాషను ఆధునిక జీవితంతో అనుసంధానం చేయాలని భావించింది. దానికోసం ఫుడ్ వ్లాగింగ్ ప్రారంభించింది. అంటే, ఆహార పదార్ధాల గురించి సంస్కృతంలో వీడియోలు తయారుచేసి ఇంటర్నెట్‌లో పెట్టడం. బెంగళూరులోని వైవిధ్యభరితమైన భోజనశాలలను ప్రపంచానికి సంస్కృతంలో పరిచయం చేస్తోంది సమష్ఠి. మహానగరంలోని పురాతన ప్రియదర్శిని రెస్టారెంట్ నుంచి అత్యాధునికమైన కెఫేల వరకూ అన్నింటినీ దేవభాషలోనే పరిచయం చేస్తోంది. సమష్ఠి వ్లాగ్‌లు కేవలం ఆహారం గురించి మాత్రమే చెప్పవు, వాటి వెనుక కథలను తరచి చెబుతాయి. చూడడానికి కంటికి ఇంపుగానూ, మనసుకు నిండుగానూ ఉండేలా తన సంస్కృత వ్లాగ్‌లను తీర్చిదిద్దుతోంది సమష్ఠి.

చాలామంది సంస్కృతం ఒక మతానికి, దాని ధర్మాలకూ సంబంధించిన భాష అని అనుకుంటారు. ఆ మూసని ఛేదించి, మామూలు సంభాషణలకు సైతం వాడుకోగల భాష సంస్కృతం అని యువతరానికి తెలియబరచడమే నా ఉద్దేశం అంటుంది సమష్ఠి. అందుకే తన ఫుడ్ వీడియోల్లో ఆమె మాట్లాడే భాష సరళంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. స్థానిక భాషలో సబ్‌టైటిల్స్ కూడా అందుబాటులో ఉన్నందున, ఆమె వీడియోలను ఎక్కువమంది చూడగలరు.

పిజ్జా హట్, మెక్‌డొనాల్డ్స్ వంటి నవతరం కెఫేల గురించి సరళమైన సంస్కృతంలో వివరించే సమష్ఠి వీడియోలు యువతరాన్ని ఆకట్టుకుంటున్నాయి. ‘‘బర్గర్లు, పిజ్జాల గురించి సంస్కృతంలో చర్చించడం, వాటిని సంస్కృతభాషలో ఎలా పలకాలి వంటి విషయాలను మాట్లాడడం… ఇలాంటి ప్రయత్నాలతో ప్రాచీన భాషకు, ఆధునిక ప్రపంచానికీ మధ్య దూరాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాను’’ అంటోంది సమష్ఠి.

మొదట్లో సంస్కృతంలో వ్లాగింగ్ చేయడంలో సమష్ఠి ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంది. ‘‘చాలామంది ఆహారం గురించి సంస్కృతంలో మాట్లాడడానికి మొహమాటపడేవారు. కానీ నేను సానుకూల దృక్పథంతో వ్యవహరించేదాన్ని. జనాలు తమ అభిప్రాయాలను సంస్కృతంలోనే వ్యక్తీకరించడానికి వారిని ప్రోత్సహించేదాన్ని. నా ప్రయత్నంలోని నిజాయితీని ప్రజలు హర్షించారు. అంతేకాదు, సంస్కృతం అర్ధం కానివారు సైతం నా వ్లాగ్ వీడియోలను చూసి అభినందిస్తున్నారు’’ అని సమష్ఠి వివరించింది.

సమష్ఠి గుబ్బి సంస్కృతం వ్లాగ్‌ వీడియోలు, ఆహారం గురించి చెప్పుకునే కబుర్లు మాత్రమే కావు. అవి సంస్కృతిని, చరిత్రను పరిరక్షించే, సంస్కృతభాషను జనసామాన్యానికి చేరువ చేసే ప్రయత్నాలు.