News

రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు స్వామి స్మరణానంద శివైక్యం

433views

రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు స్వామి స్మరణానంద మహరాజ్ సోమవారం (మార్చి 25) సాయంత్రం కోల్‌కతాలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 95. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. కన్నుమూసినట్లు రామకృష్ణ మిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. మిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దక్షిణ కోల్‌కతా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ స్మరణానంద కన్నుమూశారు. మంగళవారం బేలూరులో ఆయన పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. స్వామి స్మరణానంద మహరాజ్ 2017లో 16వ రామకృష్ణ మిషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

స్మరణానంద మహరాజ్ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ X వేదికగా తన సంతాపాన్ని తెలియజేశారు. “రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ అధ్యక్షుడు శ్రీమత్ స్వామి స్మరణానంద జీ మహారాజ్ తన జీవితాన్ని ఆధ్యాత్మికత, సేవకు అంకితం చేశారు. అతను లెక్కలేనన్ని హృదయాలు, మనస్సులపై చెరగని ముద్ర వేశారు. అతని కరుణ, జ్ఞానం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. కొన్నేళ్లుగా ఆయనతో నాకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. నేను 2020లో బేలూర్ మఠాన్ని సందర్శించినప్పుడు నేను అతనితో సంభాషించాను. కొన్ని వారాల క్రితం కోల్‌కతాలో.. నేను కూడా ఆసుపత్రికి వెళ్లి అతని ఆరోగ్యం గురించి ఆరా తీశాను. బేలూరు మఠంలోని అసంఖ్యాక భక్తులతో నా ఆలోచనలు ఉన్నాయి. ఓం శాంతి’’ అని మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఆయనకు సంతాపం తెలిపారు. “రామకృష్ణ మఠం, మిషన్ అధ్యక్షుడు శ్రీమత్ స్వామి స్మరణానందజీ మహారాజ్ మరణించారనే వార్తతో చాలా బాధపడ్డాను. ఈ గొప్ప సన్యాసి తన జీవితకాలంలో రామకృష్ణుల ప్రపంచ క్రమానికి ఆధ్యాత్మిక నాయకత్వాన్ని అందించాడు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది భక్తులకు ఓదార్పునిచ్చాడు. ఆయన తోటి సన్యాసులు, అనుచరులు, భక్తులందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.’’ అని రాశారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా శ్రీమత్ స్వామి స్మరణానంద జీ మహారాజ్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.