ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసాహితీ, విద్యా సౌరభాలు – 36 ; ముచ్చుకోట వేంకట రామయ్య

328views

కర్నూలు జిల్లాలో మొట్టమొదట పాఠకుల కోసం గ్రంథాలయాన్ని ప్రారంభించి దాదాపు యాభై సంవత్సరాలపాటు అవిశ్రాంతంగా నడిపిన వ్యక్తి, ప్రభుత్వ సహాయాన్ని ఏమాత్రం స్వీకరించకుండా తన స్వంత ధనాన్ని ఖర్చు పెట్టుతూ జిల్లాలో విద్యావ్యాప్తికి, జ్ఞానాభివృద్ధికి పాటుపడిన మహానుభావుడు ముచ్చుకోట వేంకట రామయ్యగారు. కరణం వేంకటరాయుడు, మీనాక్షమ్మ దంపతులకు 1894 అక్టోబర్ 5న అనంతపురం జిల్లా తాడిపత్రి తాలుకాలోని ముచ్చుకోట గ్రామంలో వేంకటరామయ్యగారు జన్మించారు. వీరి ప్రాథమిక విద్య పెట్టాడ అమళ్ళదిన్నె పాఠశాలలోనూ, మాధ్యమికవిద్య గుత్తిలోనూ జరుగగా, హైస్కూల్ విద్య కర్నూలులోని కోల్స్ పాఠశాలలో పూర్తయింది. ఇంటర్, ఉపాధ్యాయ శిక్షణలను మద్రాసులో పూర్తి చేశారు. ఆ తరువాత తాను చదువుకున్న కోల్స్ హైస్కూల్లోనే ఉపాధ్యాయునిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు.

స్వాతంత్ర్యోద్యమంలో గ్రంథాలయ ఉద్యమం కూడా ఒక భాగం. ప్రజలను అక్షరాస్యులుగా మారుస్తూ, విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం ద్వారా వారిలో ఆధునిక భావాలు వ్యాప్తి చెంది, స్వాతంత్ర్యకాంక్ష బలపడి, ఉద్యమం వూపందుకోవడానికి గ్రంథాలయాలు ఎంతగానో తోడ్పడ్డాయి. స్వాతంత్య్ర సమర సమయంలో ప్రజలకు సందేశాలు పంపేందుకు, నాయకులు పోలీసుల కళ్ళు గప్పి సమావేశం అయి చర్చలు చేసుకునేందుకు గ్రంథాలయాలు ఉపయోగపడ్డాయి. సాధారణ పాఠకుల్లా అక్కడికి చేరి మాట్లాడుకుని కొత్త ఆలోచనలతో తమ తమ కార్యస్థానాలకు వెళ్ళేవారు. వేంకటరామయ్యగారు ముచ్చుకోటలో వున్నప్పుడు దాని మజరా గ్రామమైన వరదాయపల్లెలో నడుపబడుతున్న సాధుజన సమాజమనే ఒక చిన్న గ్రంథాలయం వారిని ఎంతగానో ఆకర్షించింది. దానితో కర్నూలు జిల్లాలో గూడా గ్రంథాలయాన్ని స్థాపించాలని వారు భావించారు.

1921 ప్రాంతంలో రాయలసీమ అంతా కలిపినా కేవలం ముప్పై గ్రంథాలయాలు గూడా లేవు. ఇక కర్నూలు జిల్లాలోనయితే ఒక్కటి లేదు. నిజానికి అలా స్థాపించడం అప్పట్లో పెద్ద సాహసమే. ఆంగ్లేయ ప్రభుత్వం గ్రంథాలయాలు నడిపే వారిపై ఒక కన్నేసి వుంచేది. కానీ ముచ్చుకోట గారు ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా 1/8/1923 లో కొత్తపేటలోని తన స్వంత ఇంటిలో గ్రంథాలయాన్ని “ఆంధ్ర గ్రంథాలయం” అనే పేరుతో స్వంతఖర్చుతో ప్రారంభించారు. వేంకటరామయ్య గారు దేశంలోని వివిధ ప్రాంతాలలోని పుస్తక ముద్రణదారులతో సంబంధాలు నెలకొల్పుకొని ఎంతో అమూల్యమైన గ్రంథాలు ఎప్పటికప్పుడు పాఠకుల కోసం తెప్పించేవారు. వారు ఉపాధ్యాయునిగా ఉద్యోగం నిర్వహిస్తూ వుండడం తాడిపత్రి విభాగాన్ని ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఏడు వరకు తెరవడం మొదలు చేత సాయంకాలం 5 గంటల నుంచి 7 గంటల దాకా మాత్రమే గ్రంథాలయం తెరిచేవారు. 1955లో పదవీ విరమణ చేశాక వీరు గ్రంథాలయంలో పత్రికా విభాగాన్ని ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఏడు వరకు తెరవడం మొదలుపెట్టారు. వేంకటరామయ్యగారు గ్రంథాలయ నిర్వహణకు సంబంధించి ఏ కోర్సులూ చదవకపోయినా వాటి నిర్వహణ తీరు చాలా అద్భుతంగా వుండేది. పుస్తకాలను దారంతో కుట్టి, చక్కగా బైండు చేసి, క్రమ సంఖ్యలు వేసి, అద్దాల బీరువాలో వరుసగా భద్రపరిచేవారు. పురాణాలు, నవలలు, చరిత్ర, గణితం, ఇలా ఇరవై భాగాలుగా విభజించబడి, పుస్తకాల కేటలాగు అందరికీ అందుబాటులో వుండేది.

1930 ప్రాంతంలో ఈ గ్రంథాలయం కొత్త పేట నుంచి నరసింహారావు పేటలోని తన నూతన స్వగృహంలోకి మార్చబడింది. ఇంటిలో నాలుగింట మూడువంతులు గ్రంథాలయ నిర్వహణకు ఉపయోగించారు. దీన్ని నడపడానికి ఆర్థికంగా ఇబ్బంది పడగూడదని తన ఇరవై ఎకరాలపై వచ్చే ఆదాయాన్ని దీని కోసమే ప్రత్యేకంగా ఉపయోగించేవారు. అలాగే వీరి సోదరి వెంకమ్మ గారు కూడా తన పదెకరాలపై వచ్చే ఆదాయాన్ని గ్రంథాలయ నిర్వహణకు పంపించేవారు.

రంగనాథ రామాయణాన్ని ఎంతగానో అభిమానిస్తూ నిరంతరం పారాయణం చేసే వీరు 16 ఏళ్ళ వయసులో శ్రీరామ శతకం రచించి ముద్రించారు. 1970-73లో కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులుగా పని చేసిన వీరు గ్రంథాలయ సంస్థ సభ్యులుగా జీవితాంతం కొనసాగారు. అనేక ఆర్థిక సమస్యలు వుప్పెనలా వీరిని చుట్టుముట్టాయి. అయినప్పటికీ వీరు గ్రంథాలయాన్ని నడపడం ఆపివేయడం గానీ, పుస్తకాలు, పత్రికలు తెప్పించడం నిలిపివేయడం గానీ చేయలేదు. 1972లో వారు మరణించే వరకు ఎప్పుడూ ఆపలేదు.