
మళ్లీ అణుపరీక్ష జరగలేదు.. కానీ రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ప్రాంతం దద్దరిల్లింది. శత్రు క్షిపణులేవీ సరిహద్దులు దాటి రాలేదు. కానీ, ఎడారి ఇసుక ఆకాశాన్నంటింది. యుద్ధవిమానాలు, ట్యాంకుల గర్జనలు, నౌకాదళ మెరుపు దాడులు, రాకెట్ ప్రయోగాలతో ఆ ప్రాంతం.. యుద్ధక్షేత్రాన్ని తలపించింది. ప్రత్యర్థుల గుండెల్లో దడపుట్టించేలా ‘భారత్ శక్తి’ పేరుతో మంగళవారం మన త్రివిధ దళాలు నిర్వహించిన విన్యాసాల్లో ఆవిష్కృతమైన దృశ్యాలివి. ‘ఆత్మనిర్భర్ భారత్’లో భాగంగా దేశంలో రూపొందించిన అత్యాధునిక ఆయుధాల పాటవాన్ని ఇందులో ప్రదర్శించారు. ప్రత్యర్థి కయ్యానికి కాలుదువ్వితే.. మన త్రివిధ దళాలు ఎలా సమన్వయంతో పనిచేస్తాయన్నది ఈ విన్యాసాలు కళ్లకు కట్టాయి. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే, విదేశీ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. 50 నిమిషాల పాటు ఒళ్లు గగుర్పొడిచేలా ఈ విన్యాసాలు జరిగాయి.
యుద్ధాన్ని తలపించేలా..
అదృశ్య దళం అండతో…
ఆధునిక యుద్ధతంత్రంలోకి ఓ ‘అదృశ్యశక్తి’ చేరింది. నిఘా ఉపగ్రహాలు, ద్రోన్లు, అవి అందించే సమాచారం ఆధారంగా కృత్రిమ మేధ (ఏఐ)తో అప్పటికప్పుడు వ్యూహాల్లో మార్పులు చేస్తుంటారు. దేశాలు.. తమ ఆయుధాగారాలు, వ్యూహాత్మక స్థావరాలు, చమురు నిల్వ కేంద్రాలను శత్రు ఉపగ్రహాలు గుర్తుపట్టకుండా చూడటానికి వాటి రూపురేఖల్లో మార్పులు చేస్తుంటాయి. మన ఉపగ్రహాలు, డ్రోన్ల ద్వారా అందిన సమాచారాన్ని ఏఐతో విశ్లేషిస్తే ఆ గుట్టు వీడుతుంది. ఆ సామర్థ్యాన్ని కూడా తాజా విన్యాసాల్లో ప్రదర్శించారు.





