
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) మళ్లీ తెరపైకి వచ్చింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌ల నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మనదేశ పౌరసత్వాన్ని కల్పించడం లక్ష్యంగా
కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. సీఏఏ చట్టం-2019లోనే పార్లమెంటు ఆమోదం పొందినా.. రాష్ట్రపతి సమ్మతి కూడా లభించినా. .. విపక్షాల ఆందోళనలు, దేశవ్యాప్తంగా నిరసనల కారణంగా అమలులో జాప్యం జరిగింది. పూర్తిస్థాయి నిబంధనలపై సందిగ్ధం నెలకొనడంతో ఆ చట్టం కార్యరూపం దాల్చలేదు. సార్వత్రిక ఎన్నికలకు ముందే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పలుమార్లు చెబుతూ వచ్చారు. సరిగ్గా అదనుచూసి ఇప్పుడు దానిని తెరపైకి తెచ్చారు.
ఏమిటీ నిబంధనలు?
పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం మన పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ నిబంధనల్ని కేంద్రం రూపొందించింది. 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే ముగుస్తుంది. కేంద్ర నిర్ణయంపై విపక్షాలన్నీ భగ్గుమన్నాయి. కొందరి పట్ల వివక్ష చూపేలా ఉంటే దీనిని అమలుచేయబోమని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఈ చట్టాన్ని తాము అమలు చేసేది లేదని కేరళ ముఖ్యమంత్రి విజయన్‌లు తెగేసిచెప్పారు. అల్లర్లు చెలరేగవచ్చనే అనుమానంతో పలు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
తొలగనున్న అడ్డంకులు
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చినవారికి చట్టపరంగా పౌరసత్వం దక్కనున్నందున వారికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోతాయి. దశాబ్దాల తరబడి కాందిశీకుల్లా బతుకుతున్నవారికి గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. వారి సంస్కృతి, భాష, సామాజిక గుర్తింపులకు రక్షణ లభిస్తుంది. దేశంలో ఎక్కడికైనా రాకపోకలు సాగించొచ్చు. ఆస్తులు కొనవచ్చు.
రెండు చట్టాల నుంచి మినహాయింపు
సీఏఏ కింద భారత పౌరసత్వాన్ని కోరుతూ వచ్చే దరఖాస్తులపై నిర్ణయం తీసుకునే సాధికార కమిటీకి జనాభా లెక్కల డైరెక్టర్ నేతృత్వం వహిస్తారు.
అక్రమ వలస కేసుల మూసివేత
సాధారణ పరిస్థితుల్లో పౌరసత్వం పొందాలంటే దరఖాస్తు చేసుకోవడానికి ముందు కనీసం 11 ఏళ్లపాటు భారత్‌లో నివసించాలి. లేదంటే కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో పనిచేయాలి. అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు మాత్రం నివాస అర్హతను అయిదేళ్ల కాలానికి కుదించింది. ఒకసారి వీరికి పౌరసత్వం దక్కితే వారు భారత్‌లో ప్రవేశించిన నాటినుంచి భారతీయ పౌరులుగానే గుర్తిస్తారు. వారిపై అక్రమ వలస కేసులన్నీ మూసేస్తారు. చట్టం పరిధిలో ముస్లిమేతరులనే ప్రస్తావించడంపై గతంలో దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఇందులో 53 మంది ప్రాణాలు కోల్పోయారు.
పాక్ హిందూ శరణార్థుల హర్షం
సీఏఏ-19 అమలుతో ఎట్టకేలకు తాము భారతీయ పౌరులం అవుతున్నామని దిల్లీలో ఉంటున్న పాకిస్థానీ హిందూ శరణార్థులు హర్షం వ్యక్తంచేశారు. ఎన్నోఏళ్లుగా దీనికోసమే నిరీక్షిస్తున్నామని వారి ప్రతినిధి ధరంవీర్ సోలంకి చెప్పారు. సోమవారం సాయంత్రం ఈశాన్య దిల్లీ, షాహీన్‌బాగ్, జామియానగర్ వంటి సున్నితమైన ప్రాంతాల్లో భద్రత పెంచారు. వదంతుల్ని, విద్వేషాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని గుర్తించడానికి సామాజిక మాధ్యమ ఖాతాలపైనా సైబర్ విభాగం దృష్టి సారించింది. కేంద్ర ప్రకటన వెలువడగానే అస్సాంలో ‘ఆసు’ సహా వివిధ సంఘాలు ఆందోళనకు దిగాయి. సీఏఏ ప్రతుల్ని కాల్చివేసి, మంగళవారం హర్తాళ్ పాటించాలని పిలుపునిచ్చాయి.
ఒకసారి మురిగిపోయింది
సీఏఏ బిల్లును వాస్తవానికి కేంద్రం 2016లోనే తీసుకొచ్చింది. దానిని ‘సంయుక్త పార్లమెంటరీ సంఘం’ పరిశీలనకు పంపించగా అది 2019 జనవరి 7న నివేదిక ఇచ్చింది. ఆ మరుసటి రోజే బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. 16వ లోక్‌సభ పదవీకాలం ముగియడంతో ఆ బిల్లు మురిగిపోయింది. 17వ లోక్‌సభ ఏర్పడిన తర్వాత 2019 డిసెంబరులో ఉభయసభల్లో ఈ బిల్లును ఆమోదింపజేశారు. ఇది రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చిన అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలకు, ‘బెంగాల్ ఈశాన్య సరిహద్దు నియంత్రణ 1973’ కింద నోటిఫై చేసిన ‘ద ఇన్నర్‌లైన్’కు ఇది వర్తించదని చట్టంలో పేర్కొన్నారు.





