ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసాహితీ, విద్యా సౌరభాలు – 32 ; మల్లవరపు వెంకట కృష్ణారావు

295views

స్వాతంత్ర్య సమరయోధునిగా, ప్రముఖ వైద్యునిగా, విశ్వవిద్యాలయ విధాననిర్ణయ సలహాదారుగా ప్రసిద్ధిచెందిన మల్లవరపు వెంకట కృష్ణారావు భీమవరం సమీపంలోని ఉండి గ్రామంలో శ్రీరాములు, సీతమ్మ దంపతులకు ప్రథమ పుత్రునిగా జూన్ 25, 1902న జన్మించారు. వీరి అక్కగారు కూడా తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ, తమ్ముడు విశ్వేశ్వరరావులు కూడా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని కారాగార శిక్ష అనుభవించినవారే. ప్రాథమిక, మాధ్యమిక విద్య ఉండి గ్రామంలో ముగిసింది. 1921లో సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొని కొద్దిరోజులు కారాగారశిక్ష అనుభవించారు. 1930లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో యం.బి.బి.ఎస్. విద్య అభ్యసిస్తూండగా, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని శాసనోల్లంఘన చేసి ఉప్పు తయారుచేశారు. అందుచే మెడిసిన్ ఆఖరి సంవత్సరం చదువుతున్న వెంకటకృష్ణారావును విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు. క్షమాభిక్ష కోరినట్లయితే వదిలివేయగలనని విశాఖపట్నం సబ్ డివిజనల్ మేజిస్ట్రేటు అవకాశం ఇచ్చినా, క్షమాపణ కోరటానికి గాని, అపరాధరుసుము చెల్లించటానికి గాని కృష్ణారావు అంగీకరించలేదు. చివరకు మే 29, 1930 మేజిస్ట్రేటు తీర్పు చెబుతూ ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించి బరంపురం, వెల్లూరు, మదరాసు జైళ్ళకు తరలించారు. మదరాసు సెంట్రల్ జైలునందుండగానే వెంకట కృష్ణారావు యం.బి.బి.యస్. ఆఖరి సంవత్సరం పరీక్షలకు హాజరై ఉత్తీర్ణులైనారు. గాంధీ, ఇర్విన్ ఒప్పందంవలన కృష్ణారావు మార్చి 12, 1931న శిక్షాకాలం పూర్తి కాకుండానే విడుదల చేయబడ్డారు.

మెడిసిన్ పట్టభద్రుడై ప్రజలకు వైద్యసేవలందిస్తూ మంచిపేరు సంపాదించారు. 1934 నుండి 1969 వరకూ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సెనేట్ సభ్యునిగా పనిచేసి, విధాననిర్ణయాలు తీసుకోవడంలో కీలకపాత్ర వహిస్తూ, తన విశ్వవిద్యాలయంలో విద్యా ప్రమాణాల అభివృద్ధికి తన శక్తివంచన లేకుండా కృషి చేశారు. 1934 నుండి 1969 వరకూ ఆంధ్ర విశ్వవిద్యాలయంకు గౌరవమెడికల్ సలహాదారుగా కొనసాగారు. ఆ కాలంలోనే ఆంధ్ర విశ్వవిద్యాలయపు మెడికల్ డిగ్రీకి ‘మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ నుండి గుర్తింపు లభించేటట్లు కృషిచేయటంలో వీరి పాత్ర ప్రశంసనీయమైంది. 1947 నుండి 1962 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సిండికేట్ సభ్యునిగా పనిచేసి పాలనాపరమైన అనేక మార్పులకు కారకులైనారు. ‘ఇండియన్ మెడికల్ అసోషియేషన్’ ఆంధ్రశాఖకు అధ్యక్షునిగా పనిచేశారు. గుంటూరునందు మెడికల్ కళాశాల స్థాపించటంలో వీరి కృషి ఎంతో ఉంది. కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాల వ్యవస్థాపకునిగా, దాని అభివృద్ధికి నిరంతరం శ్రమించారు.

వీరి సేవలను వినియోగించుకొనేందుకు ఉమ్మడి మదరాసు రాష్ట్ర ప్రభుత్వం 1952 జనవరిలో ‘రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్’కు సభ్యునిగా ఎన్నుకుంది. రాష్ట్ర విద్యాశాఖామంత్రిగా, మరియు హరిజన సంక్షేమశాఖా మంత్రిగా రాజ గోపాలాచారి మంత్రిమండలిలో ఆంధ్రరాష్ట్ర విభజన అయ్యేంతవరకూ అనగా 1953 వరకూ కొనసాగి విద్యాపరంగా అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ లోని ‘గాంధీ స్మారక నిధి’కి ‘గాంధీ సాహిత్య ప్రచురణాలయాని’కి 1959లో తొలి అధ్యక్షునిగా నియమించబడినారు. జీవితాంతం విద్యారంగానికి, విశేషించి వైద్యరంగానికి ఎనలేని సేవలందించిన మల్లవరపు వెంకటకృష్ణారావు అక్టోబరు 17, 1981న తన 79వ ఏట విశాఖపట్నంలో గుండెపోటుతో స్వర్గస్తులైనారు.