
స్వాతంత్ర సమరంలో కొందరు ప్రముఖులు జాతీయవిద్య, జాతీయ సాహిత్యంతో పోరాటంలో పాలు పంచుకున్నారు. ఆంధ్రలో వారి గేయాలు, పాటలు, ప్రసంగాలు, విద్యాసంస్థల ఏర్పాటు, గ్రంథాలయాల స్థాపన, విద్యా వ్యాప్తి పరోక్షంగా ఆంధ్రదేశ మంతటా స్వాతంత్ర పోరాటం విస్తరించటంలో సహాయపడింది. వారి ముందుచూపుతో అన్ని ప్రాంతాలలో విద్యా స్పూర్తి వచ్చింది. ప్రజలలో అవగాహన పెరిగింది.అటువంటి వారిలో ఒకరు కోపల్లె హనుమంతరావు
విద్యార్థుల యొక్క గురుతరమైన బాధ్యతను గుర్తించి తన యావత్ జీవితాన్ని జాతీయ విద్యావిధాన రూపకల్పనకు అంకితం చేసిన వారు శ్రీ కోపల్లె హనుమంతరావు. వీరు 1879లో అవురిపూడి గ్రామంలో జన్మించి ఎంతో ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు. వీరు సంఘసేవా పరాయణులుగా గుర్తింపునొంది మచిలీపట్నంలో ఆంధ్రజాతీయ కళాశాల ప్రారంభంలో ప్రముఖపాత్రను పోషించారు. వీరి తండ్రి కృష్ణారావు గారికి జ్యేష్ఠపుత్రుడుగా పుట్టిన వీరు యం.ఏ. బి.ఎల్. పరీక్షలో ఉత్తీర్ణులై బందరులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు, జకాలంలో వీరి తండ్రిగారు చల్లపల్లి సంస్థానంలో దివానులుగా పనిచేసేవారు. తన తండ్రి తదనంతరం ఆయనను దివాను పదవిని స్వీకరించమని కోరగా దానిని తిరస్కరించి ప్రజాహిత కార్యక్రమాలలో ప్రముఖపాత్రను పోషిస్తూ వచ్చారు. వీరు మద్రాసు రెసిడెన్సీ కాలేజీలో వృక్షశాస్త్రంలో ఎం.ఎ. పట్టాను పొందారు. తదుపరి 1902 వరకు అక్కడ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. ఆ సమయంలో ఇచ్చి స్వాతంత్ర్య ఉద్యమ సంగ్రామంలో చురుకైన పాత్రను పోషిస్తూ తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. బందరులో న్యాయవాద వృత్తిని ప్రారంభించిన శ్రీ కోపల్లె హనుమంతరావు గారు తన వృత్తికన్నా తన ప్రవృత్తి అయిన స్వాతంత్ర ఉద్యమానికి ప్రాముఖ్యమిచ్చి న్యాయవాదవృత్తిని త్యజించడమే కాక తనకు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన లాయర్ పట్టాను చింపివేసి తమ నిరసనను తెలియచేసి స్వాతంత్ర్యోద్యమంలో ప్రముఖపాత్రను పోషిస్తూ వచ్చారు.
స్వాతంత్య్ర సాధనలో అనేకమంది మహనీయులు అతివాదులుగా, మితవాదులుగా అనేక మార్గాలలో స్వాతంత్య్ర సంగ్రామాన్ని ముందుకు తీసుకొని వెళుతుంటే శ్రీ కోపల్లె హనుమంతరావుగారు ఒక విభిన్న విలక్షణ మార్గాన్ని ఎంచుకొని స్వాతంత్య్ర సంగ్రామ సాధనలో తనకంటూ ఒక ప్రత్యేకతను నిరూపిస్తూ వచ్చారు. మొక్కై వంగనిది మానై వంగునా? అన్న భావాన్ని హృదయంలో నింపుకొని చిన్ననాటి నుండి విద్యార్థినీ విద్యార్థులలో జాతీయ భావాలను స్వాతంత్య్ర భావాలను, ధార్మికభావాలను నింపి నిజమైన స్వాతంత్ర్యోద్యమ కార్యోన్ముఖులను గావింపదలచి మచిలీపట్నంలో జాతీయ కళాశాల స్థాపన ద్వారా విద్యార్థినీ, విద్యార్థులలో స్వాతంత్ర సంగ్రామ స్ఫూర్తిని నింపవచ్చని శీలసంపన్నులైన విద్యావంతులను తీర్చిదిద్దవచ్చనే సంకల్పంతో ఆంధ్ర జాతీయ కళాశాల నిర్మాణంలో కీలక పాత్రను నిర్వహించారు. ఈ కళాశాలలో ఆంధ్రరత్న శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారిచే చతురి పురుషార్ధములను గురించి, భారతీయ కళలను గురించి, కళాశాలలో విద్యార్థులకు ప్రసంగాలను పెట్టించేవారు. అంతేకాక శ్రీ తల్లావఝల శివశంకర శాస్త్రి, శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీ బెల్లంకొండ రాఘవరావు, శ్రీ పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, శ్రీ నాయని సుబ్బారావు లాంటి ఉద్దండ పండితులచే కళాశాలలోని విద్యార్థినీ విద్యార్థులకు చక్కని ఉపన్యాసములను ఏర్పాటు ఉత్సాహ ప్రోత్సాహాలను తట్టిలేపి భారతీయ ఔన్నత్యాన్ని చాటిచెప్పారు.
విద్యార్థులలో విజ్ఞాన, సుజ్ఞాన, ప్రజ్ఞానాన్ని వెలికితీసి దేశభక్తి భావాలను పెంపొందించి వారి హృదయాలలో ధార్మిక చింతనను నింపి తద్వారా శీలవంతులైన గుణవంతులైన పౌరులను తయారుచేయాలనే సంకల్పంతో చరిత్ర, పరిశోధన ఆంధ్రకావ్య వ్యాసంగము, చిత్రలేఖనము, గ్రామోద్దరణ తరగతులను నిర్వహించేవారు విద్యావిధానానికి అనుగుణంగా కళాశాల నిర్వహణ ఉండాలని శ్రీ హనుమంతరావు గారు ఆకాంక్షించేవారు.
1906వ సం॥లో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభ స్వరాజ్య సంపాదనకు జాతీయ విద్యావిధానమే సాధనముగా నిర్ణయించుటను పురస్కరించుకొని ఆయన 1907లో బృందావనపురమున ఆంధ్ర జాతీయ కళాశాల అను విద్యాసంస్థను ఆరంభించారు. ఆయన కేవలము స్వశక్తితో ఆత్మైక సహాయుడై పదునైదు సంవత్సరముల కాలము ఎడతెగక బహుముఖములుగా ప్రయత్నించి, లక్షలాదిగా ధనమును వెచ్చించి, ముప్పది ఎకరములవరకు తోటలను, పొలములను సేకరించి ఆ విద్యాసంస్థను కళాశాల రూపమునకు తీసుకొని వచ్చి సర్వాంగీణముగా జాతీయ విద్యాభ్యుదయ కాసములకు ప్రయత్నించి సాధనా సామగ్రిని సమకూర్చి కళాశాల పురోభివృద్ధికి ఇతోధికముగా పాటుపడినారు. కేవలం నాలుగు పదుల వయసులోనే నింగికెగిన నిగర్వి, నిస్వార్థ విద్యావేత్త శ్రీ కోపల్లె హనుమంతరావు గారు సదా స్మరణీయులు.





