News

ఎట్టకేలకు సీబీఐ కస్టడీకి షాజహాన్‌

246views

పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో జనవరి 5న ఈడీ అధికారులపై జరిగిన మూకదాడి కేసులో కోల్‌కతా వేదికగా బుధవారం రోజంతా హైడ్రామా నడిచింది. ఎట్టకేలకు ప్రధాన నిందితుడైన బహిష్కృత టీఎంసీ నేత షాజహాన్‌ షేక్‌ను రాష్ట్ర సీఐడీ అధికారుల నుంచి సీబీఐ తన కస్టడీలోకి తీసుకొంది. ఈ ఉత్తర్వుల అమలుకు కలకత్తా హైకోర్టు వరుసగా మంగళ, బుధవారాల్లో రెండు ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చింది. కేసు దర్యాప్తు బాధ్యతలను కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగిస్తూ కలకత్తా హైకోర్టు మంగళవారమే ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల నిలుపుదలకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిని తక్షణమే విచారించలేమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పడంతో హైకోర్టు ఆదేశాల అమలుకు మంగళవారం సాయంత్రం సీబీఐ అధికారుల బృందం.. కోల్‌కతాలోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లింది.

‘సబ్‌జుడిస్‌’ సాకుతో షాజహాన్‌ అప్పగింతకు సీఐడీ పోలీసులు ససేమిరా అనడంతో సీబీఐ బృందం ఖాళీ చేతులతో వెనుదిరగాల్సి వచ్చింది. ఈ విషయం బుధవారం మళ్లీ హైకోర్టు ముందుకు వచ్చింది. మంగళవారం నాటి హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వం షాజహాన్‌ను అప్పగించలేదని ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు వాదించారు. దీంతో షాజహాన్‌ను తక్షణం సీబీఐకి అప్పగించాలంటూ బుధవారం సాయంత్రం 4.15 దాకా కలకత్తా హైకోర్టు డెడ్‌లైన్‌ విధించింది. ఈ గడువు కూడా దాటి 6.48 గంటల ప్రాంతంలో వైద్య పరీక్షల అనంతరం షాజహాన్‌ను సీబీఐ అధికారులకు రాష్ట్ర సీఐడీ అప్పగించింది. మరోవైపు.. బెంగాల్‌ ప్రభుత్వ పిటిషన్‌ను రెండోరోజైన బుధవారం కూడా సుప్రీంకోర్టు తక్షణ విచారణకు పరిగణనలోకి తీసుకోలేదు.