
348views
ఆలయాలను ప్రత్యేకంగానూ, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలానూ నిర్మిస్తుంటారు. అయితే ఆకృతిలోనూ అడుగడుగునా దైవత్వం ప్రతిబింబించేలా ఓ ఆలయాన్ని ‘ఓం’ ఆకృతిలో తీర్చిదిద్దారు. ఓంకారం ప్రతిధ్వనించడంతోపాటు అదే ఆకారంలో సాక్షాత్కరించే ఆ ఆలయాన్ని చూడాలంటే మాత్రం రాజస్థాన్‌లోని పాలీ జిల్లాలో ఉన్న జోదన్ గ్రామానికి వెళ్లాల్సిందే. దాదాపు 300 ఎకరాల్లో నాలుగు అంతస్తుల్లో నిర్మించిన ఈ శివాలయాన్ని ‘విశ్వదీప్ గురుకుల్’ ఆశ్రమాన్ని నడిపిస్తున్న స్వామీ మహేశ్వరానందన్ కట్టించారు.

వందకుపైనే ఆలయాల సముదాయంతో ప్రకృతి మధ్యలో రూపుదిద్దుకున్న ఓంకార ఆలయంలో జ్యోతిర్లింగాలూ వెయ్యికిపైనే దేవతామూర్తులూ దర్శనమిస్తాయి. ఇరవై ఎనిమిదేళ్లపాటు నిర్మించిన ఆ ఆలయం ఈ మధ్యనే భక్తులకు అందుబాటులోకి వచ్చి మహాశివరాత్రి వేడుకల కోసం ప్రత్యేకంగా ముస్తాబైంది.





