News

పేదరికం నుంచి బయటపడుతున్న భారతం

290views

భారతదేశం దుర్భర దారిద్య్రాన్ని నిర్మూలించిందని విఖ్యాత అమెరికన్‌ విశ్లేషణ సంస్థ బ్రూకింగ్స్‌ అధ్యయనం తేల్చింది. 2011-12లో దేశ జనాభాలో 12.2 శాతంమంది దారిద్య్ర రేఖకు దిగువన ఉండగా 2022-23లో వారి సంఖ్య 2 శాతానికి తగ్గిపోయిందని ఆర్థిక వేత్తలు సూర్జిత్‌ భల్లా, కరణ్‌ భాసిన్‌ జరిపిన ఆ అధ్యయనం వివరించింది. 2022-23 సంవత్సరానికి భారత ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన వినియోగ వ్యయ సమాచారం ఆధారంగా వారు ఈ నిర్ధారణకు వచ్చారు.

భారత్‌లో 2011-12 నుంచి వాస్తవిక తలసరి ఆదాయం ఏటా 2.9 శాతం చొప్పున పెరుగుతూ వచ్చింది. గ్రామీణ పేదరికం 2.5 శాతానికి, పట్టణ పేదరికం ఒక శాతానికి తగ్గాయి. గ్రామీణ, పట్టణ అసమానతలు కూడా తగ్గిపోయాయి. గినీ సూచి ప్రకారం 100 పాయింట్లు అత్యధిక అసమానతను సూచిస్తాయి. భారత్‌లో పట్టణ గినీ సూచి 36.7 నుంచి 31.9కీ, గ్రామీణ గినీ సూచి 28.7 నుంచి 27కూ తగ్గిందని, ఇది కనీవినీ ఎరుగనిదని అధ్యయనం పేర్కొంది. అధిక ఆర్థికాభివృద్ధి రేటు, అసమానతల తగ్గుదల కలగలసి భారత్‌లో పేదరికాన్ని నిర్మూలిస్తున్నాయని వివరించింది. అంతకుముందు దారిద్య్ర స్థాయులు తగ్గడానికి 30 ఏళ్లు పడితే 2011-12 నుంచి 11 ఏళ్లలోనే అదే స్థాయి తగ్గుదలను సాధించడం విశేషమని అధ్యయనకర్తలు తెలిపారు.