
ముంబయికి చెందిన షబ్నమ్ షేక్ అనే యువతి తన అభిమాన నాయకుడు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావాలని సైకిల్ యాత్ర చేపట్టింది. దేశవ్యాప్తంగా 12 జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు ఈ యాత్ర చేపట్టినట్లు ఆమె చెబుతోంది. రోజుకు 80 నుంచి 90 కిలోమీటర్లు సైకిలు తొక్కుతున్న షబ్నమ్ మరో 7-8 నెలల్లో యాత్రను పూర్తి చేస్తానని ధీమాగా చెబుతోంది. సైకిలుకు కాషాయ జెండాలు కట్టి అందంగా తీర్చిదిద్దింది. తన స్నేహితుడితో కలిసి ఈ యాత్రను ప్రారంభించిన ఆమె హుషారుగా సైకిలు తొక్కుతూ మహారాష్ట్రలో ఉన్న రెండు జ్యోతిర్లింగాలను ఇప్పటికే దర్శించుకుంది. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోని బడ్వానీ జిల్లాకు చేరుకుంది. రాష్ట్రంలోని ఓం కారేశ్వర్ వద్దకు.. ఆ తర్వాత ఉజ్జయినిలోని మహాకాల్‌కు వెళ్లనున్నట్లు షబ్నమ్ చెప్పింది. ‘జై శ్రీరామ్, హర్‌హర్ మహాదేవ్’ నినాదాలు చేస్తూ ముందుకు సాగుతున్న ఈమె గతంలో అయోధ్య రామయ్య దర్శనానికి కూడా ఇలాగే సైకిలుపై వెళ్లింది.





