News

భారత భాగవత కథలతో అంతరిక్షంపై ఆసక్తి పెంచుకున్న చందన

279views

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో శాస్త్రవేత్త అవాలంటే గొప్ప విద్యాసంస్థల్లో ప్రవేశం పొందాలి. దానికి బలమైన పునాది ఉండాలంటే చిన్నప్పటినుంచీ మహానగరాల్లో చదువుకోవాలి, బలమైన కుటుంబ నేపథ్యం ఉండాలి అని చాలామంది అనుకుంటారు. కానీ అవ్వారు చందన అది తప్పని తేల్చేసింది. కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించింది.

అవ్వారు చందన వైఎస్ఆర్ జిల్లా కొత్త మాధవరంలో ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. స్వగ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకూ చదువుకుంది. తర్వాత కడప జేఎంజే కళాశాలలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసింది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీలో చేరింది. ఆ సమయంలోనే టీటీసీ పరీక్ష రాసి, ప్రభుత్వోద్యోగానికి ఎంపికైంది. తన కుటుంబ నేపథ్యం చూసుకుని ప్రభుత్వోద్యోగంలో చేరిపోతే ఆమె మధ్యతరగతి కష్టాలు తీరిపోయి ఉండేవి. కానీ తన లక్ష్యాన్ని గుర్తుంచుకుని ఆ దిశగా నడవడం కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని వద్దనుకుంది.

చందన బాల్యంలో తన అమ్మమ్మ దగ్గరే పెరిగింది. ఆ సమయంలో అమ్మమ్మ ఆ చిన్నారికి భారతం, భాగవతంలోని కథలు ఉగ్గుపాలతో నేర్పించింది. దాంతో ఆ చిన్నారికి అంతరిక్షం అంటే ఆసక్తి ఏర్పడింది. చిన్నారి బాలకృష్ణుడు తన నోటిలోనే యశోదామాతకు విశ్వరూపం చూపించే ఘట్టం ఆమెకు అనంత రోదసి గురించి కుతూహలం కలిగించింది. అలా, చందన విద్యాభ్యాసానికి భారత భాగవత కథలు దారి చూపాయి.

చందనకు గణిత, భౌతికశాస్త్రాలంటే మక్కువ ఎక్కువ. స్పేస్ సైన్స్ చదవడం కోసం ఆమె ఫిజిక్స్‌లో ఎంఎస్‌సి పూర్తిచేసారు. ఇస్రోలో ఉద్యోగం కోసం నాలుగేళ్ళు నిద్రాహారాలు లేకుండా కష్టపడి పనిచేసింది. ఎట్టకేలకు 2019లో ఇస్రో నిర్వహించిన ఐఐఎస్‌టి పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. మూడులక్షల మంది హాజరైన ఆ పరీక్షలో విజయం సాధించింది. రెండేళ్ళ శిక్షణ తర్వాత యువశాస్త్రవేత్తగా కెరీర్ మొదలుపెట్టింది. ప్రస్తుతం బెంగళూరులోని యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్‌లో కమ్యూనికేషన్స్ విభాగంలో సీనియర్ ఫిజికల్ డిజైన్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. చంద్రయాన్, ఆదిత్య మిషన్‌ సహా పలు ప్రయోగాల్లో పనిచేసింది. ఆదిత్య ఎల్1 ప్రయోగం విజయవంతమైనప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందించిన శాస్త్రవేత్తల బృందంలో చందన కూడా ఒకరు. ప్రధాని ప్రశంసలు తనకు ఎంతో స్ఫూర్తి కలిగించాయంది చందన.

అమ్మ ఆదిలక్ష్మి, అమ్మమ్మ సాలమ్మ ప్రోత్సాహం వల్లనే తాను ఉన్నతవిద్యాభ్యాసం చేసి, ఇస్రోలో శాస్త్రవేత్త అవాలన్న కలను సాకారం చేసుకోగలిగానని చందన చెబుతోంది. శాస్త్ర పరిశోధనా రంగంలో మరింతమంది ఆడపిల్లలు చేరేందుకు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థినులను ప్రోత్సహిస్తూ, వారికి అవగాహన కల్పిస్తోంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో డైరెక్టర్ స్థాయికి ఎదగాలన్నది చందన లక్ష్యం.