News

దర్గా, సమాధి వుంటే వక్ఫ్ ఆస్తి అయిపోతుందా? మద్రాస్ హైకోర్టు

0views

దర్గా, వక్ఫ్ బోర్డు ఆస్తుల విషయంలో మద్రాసు హైకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. ఓ ప్రదేశంలో దర్గా వున్నంత మాత్రాన అది వక్ఫ్ ఆస్తిగా పరిగణించబడదని జూన్ 5 న తీర్పునిచ్చింది. ఆ భూమిపై తమకున్న హక్కును నిరూపించుకోవడానికి వక్ఫ్ బోర్డు సంబంధిత పత్రాలను సమర్పించాలని కోర్టు తేల్చి చెప్పింది.

240 ఏళ్ల నాటి దర్గాకు సంబంధించిన ఒక కేసులో, ఆ భూమికి సంబంధించి వక్ఫ్ సర్వే జరగలేదని లేదా దానిని వక్ఫ్ ఆస్తిగా నోటిఫై చేయలేదని మద్రాసు హైకోర్టు గుర్తించింది. ఈ కారణంతో, ఆ దర్గా నమోదుకు సంబంధించిన ఉత్తర్వును కోర్టు రద్దు చేసింది.

తమిళనాడు వక్ఫ్ బోర్డు వర్సెస్ సయ్యద్ హబీబుల్లా షా కహ్దారీ కేసులో, ఆ భూమిపై తమ యాజమాన్య హక్కును వక్ఫ్ బోర్డు చట్టపరంగా నిరూపించుకోవాలని జస్టిస్ కె. గోవిందరాజన్ తిలక్వాడి తీర్పునిచ్చారు. చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తిగా గుర్తించబడితే తప్ప, కేవలం ఒక దర్గా ఉన్నంత మాత్రాన ఆ భూమి వక్ఫ్ బోర్డు పరిధిలోకి రాదని న్యాయస్థానం పేర్కొంది.

ప్రతి సమాధి లేదా దర్గా దానంతటదే వక్ఫ్ ఆస్తిగా మారదని న్యాయమూర్తి ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.ముస్లిం చట్టం ప్రకారం, ఒక ముస్లిం వ్యక్తి ఏదైనా ఆస్తిని పూర్తిగా మతపరమైన ప్రయోజనం కోసం అంకితం చేసినప్పుడు మాత్రమే అది వక్ఫ్ ఆస్తిగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు.

ట్రిప్లికేన్‌లోని సయ్యద్ హబీబుల్లా షా ఖాదరీ ఆరిఫ్ రబ్బానీ హజ్రత్ దర్గాకు ‘ముతవల్లీ’ని నియమించాలన్న తమిళనాడు వక్ఫ్ బోర్డు ప్రతిపాదనను కూడా కోర్టు తిరస్కరించింది. సర్వే పూర్తి చేయకుండానే వక్ఫ్ చట్టం కింద నమోదు చేయాలని కూడా ఆ బోర్డు ఆదేశించి ఉంది.