News

శబరిమలలో భక్తులను ఇక తాళ్లతో ఆపరు! – ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు “విజన్ ప్లాన్”

5views

‘కార్తీకం’ వచ్చిందంటే చాలు! శబరిమల గిరులన్నీ భక్తుల రద్దీతో మార్మోగుతుంటాయి. లక్షలాదిగా తరలివచ్చే భక్తులను నియంత్రించడంతో పాటు పారిశుధ్య నిర్వహణ పెను సవాల్ అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో శబరిమలలో “హరిత ప్రాజెక్ట్” సహా భక్తుల సౌకర్యార్థం కొత్త బారికేడ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని ఇటీవల జరిగిన ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయించింది. భక్తుల రద్దీని తాళ్లతో నియంత్రించే పురాతన వ్యవస్థ స్థానంలో అనుకూలమైన క్యూలైన్లు నిర్మించాలని తీర్మానించారు. తద్వారా గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు ఉపశమనం లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఇక భద్రతా ఏర్పాట్లతో పాటు కొత్త కమ్యూనికేషన్ ప్రొటోకాల్ కూడా రూపొందించనున్నారు. సన్నిధానం, పంపా నది కరకట్ట వద్ద వ్యర్థాల తొలగింపు కోసం ఒక ప్రత్యేక పారిశుధ్య ప్రొటోకాల్‌ను అమలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

శబరిమల విజన్ ప్లాన్‌లో భాగంగా ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రంలో మొదటి బ్యాచ్ ఉద్యోగులకు శిక్షణ ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ట్రావెన్‌కోర్ బోర్డు అధ్యక్షుడు కె.జయకుమార్ అధికారికంగా ప్రారంభించారు.

శబరిమల మండల దీక్ష, మకరవిళక్కు యాత్రా కాలాన్ని యాత్రికులకు మరింత అనుకూలంగా మార్చాలని ట్రావెన్​కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయించింది. “శబరిమల విజన్ ప్లాన్‌” అమలుపై ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పలు ప్రాజెక్టులపై చర్చ జరిగింది. “విజన్ ప్లాన్‌”కు హైకోర్టు గతంలోనే ఆమోదం తెలిపిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా శబరిమలలో కొత్త మార్పులు తీసుకువస్తున్నారు. ఈ సమావేశానికి పోలీస్, అగ్నిమాపక దళం, ఆహార భద్రతా విభాగం, కేఎస్‌ఈబీ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. యాత్రికులకు తాగునీరు, విశ్రాంతి సౌకర్యాలు కల్పించేందుకు సరైన సమన్వయం అవసరమని సమావేశం సూచించింది.

శబరిమలలో హరిత ప్రాజెక్ట్
శబరిమల, పంపాలోని దేవస్థానం బోర్డు భూమిలో అటవీ శాఖ సహకారంతో గ్రీన్ శబరిమల ప్రాజెక్టును అమలు చేయనున్నారు. శబరిమల పర్యావరణ లక్షణాలకు అనువైన చెట్లను నాటడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఈ ప్రాజెక్టు రెండేళ్లపాటు కొనసాగుతుంది. గ్రీన్ ప్రాజెక్ట్ ద్వారా ప్లాస్టిక్ రహిత శబరిమల లక్ష్యాన్ని సాధించడంపై అధికారులు దృష్టి సారించారు.

లక్షలాది భక్తులు సందర్శించే శబరిమలలో ట్రాఫిక్‌ సహా దైనందిన కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం ఉపయోగంలో లేని ప్రాంతాలలో చెట్లను నాటనున్నారు. పెరియార్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో భాగమైన సన్నిధానంలో పచ్చదనాన్ని కాపాడటానికి ఈ ప్రాజెక్ట్ సహాయపడుతుంది.