News

కార్మికుల అంకితభావం, నైపుణ్యం మరియు దృఢచిత్తం పురోగతికి చోదకశక్తి

34views

ప్రస్తుత పరిస్థితుల్లో కార్మికులకు, వారి వలసలకు సంబంధించి అనేక ఆందోళనలు ఎదురవుతున్నాయని, భారతీయ మజ్దూర్ సంఘ్ భారతీయ మజ్దూర్ సంఘ్ అఖిల భారతీయ సంఘటనా కార్యదర్శి బి. సురేంద్రన్ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే సామాజిక భద్రతా పరిధిలో AI వల్ల కార్మికులకు కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయని కూడా అన్నారు.

జెనీవాలో జరుగుతున్న ఐఎల్ఓ సదస్సులో సురేంద్రన్ కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశపు అతిపెద్ద జాతీయ కార్మిక సంఘాల సమాఖ్య అయిన ‘భారతీయ మజ్దూర్ సంఘ్’ (BMS) తరపున, అంతర్జాతీయ కార్మిక సదస్సులో పాల్గొంటున్న ప్రతినిధులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రపంచ జనాభాలో దాదాపు ఐదవ వంతు ప్రజలకు నిలయమైన భారతదేశం, నేడు ప్రపంచ ఆర్థిక పరివర్తనలో అగ్రగామిగా నిలుస్తోందన్నారు. జాతీయ అభివృద్ధికి మరియు ప్రపంచ ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా కృషి చేస్తున్న లక్షలాది మంది కార్మికుల అంకితభావం, నైపుణ్యం మరియు దృఢచిత్తం ఈ పురోగతికి చోదకశక్తిగా నిలిచాయని ప్రకటించారు.

ప్రపంచంలోనే కార్మికులకు అత్యధిక సామాజిక భద్రతా కవరేజీని సాధించిందుకు భారత్ కి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించిందని, ఈ విషయాన్ని ఈ సదస్సులో ప్రకటిస్తున్నందుకు చాలా ఆనందంగా వుందన్నారు. ప్రస్తుతం 64శాతం మంది కార్మికులు వివిధ సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి వస్తున్నారని తెలిపారు.మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన ప్రపంచ సామాజిక భద్రతా సదస్సులో అంతర్జాతీయ సామాజిక భద్రతా సంఘం (ISSA) ఈ అవార్డును ప్రదానం చేసిందని పేర్కొన్నారు.

న్యాయబద్ధమైన, సమ్మిళితమైన, పటిష్టమైన, మానవ కేంద్రీకృతమైన భవిష్యత్ కార్యక్షేత్రాన్ని నిర్మించాలనే తన అచంచలమైన నిబద్ధతను భారతీయ మజ్దూర్ సంఘ్ పునరుద్ఘాటిస్తోందని ఆయన తెలిపారు.
సాంకేతిక పరివర్తన, జనాభా మార్పు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి వల్ల ఎదురయ్యే అవకాశాలు, సవాళ్లను మనం ఎదుర్కొంటున్న ఈ తరుణంలో, ఆవిష్కరణలు మానవాళికి సేవ చేసేలా, అభివృద్ధి అందరికీ ప్రయోజనం చేకూర్చేలా, ప్రతి కార్మికుడు గౌరవం, భద్రత, సామాజిక న్యాయాన్ని పొందేలా చూసేందుకు మనమందరం కలిసికట్టుగా కృషి చేద్దామని ఆయన పిలుపిచ్చారు.

ప్రపంచ నిరుద్యోగం 4.9% వద్ద స్థిరంగా ఉంటుందని అంచనా వేస్తున్న తరుణంలో, 40 కోట్ల మందికి పైగా ప్రజలను ప్రభావితం చేస్తున్న ప్రపంచవ్యాప్త ఉద్యోగ ఖాళీల కొనసాగింపు, కేవలం ఉపాధి మాత్రమే సరిపోదనే విషయాన్ని స్పష్టంగా గుర్తుచేస్తుందని ఆయన చెప్పారు. గౌరవప్రదమైన వేతనాలు, సామాజిక భద్రత, వృత్తిపరమైన భద్రత, నైపుణ్యాభివృద్ధికి అవకాశాలు కల్పించే నాణ్యమైన ఉద్యోగాలను సృష్టించడంపై అంతర్జాతీయ సమాజం సమానంగా దృష్టి సారించాలని సురేంద్రన్ పిలుపిచ్చారు.

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, సంఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా కార్మికులలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని చెబుతూ భారతదేశం వంటి దేశాలకు ఈ పరిణామాలు కార్మిక చలనశీలత, విదేశీ ఉపాధి అవకాశాలు, రెమిటెన్స్ ప్రవాహాలు, సరఫరా గొలుసులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సుస్థిరతపై ప్రభావం చూపుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సంఘర్షణలతో నిండిన ప్రపంచంలో, శాంతియుత సంభాషణలను ప్రోత్సహించడంలో, విధానపరమైన జోక్యాలు చేపట్టడంలో, శాశ్వత పరిష్కారాలపై చర్చించడంలో, ప్రజలలో విశ్వాసాన్ని పెంపొందించడంలో కార్మిక సంఘాల పాత్ర పెరుగుతోందని ఆయన స్పష్టం చేశారు.

శ్రమ ఒక సరుకు కాదు” అని ఐఎల్‌ఓ డైరెక్టర్ జనరల్ పునరుద్ఘాటించారని పేర్కొంటూ శ్రమ అనేది మానవ మూలధనమని బీఎంఎస్ బలంగా భావిస్తోందని తెలిపారు. కానీ “నియామకం,తొలగింపు”తో సహా కార్మికులను ప్రభావితం చేసే అన్ని రుగ్మతలకు “కార్మిక మార్కెట్” అనే విరుద్ధార్థక పదం కేంద్ర బిందువుగా మారిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ పదాన్ని ఉపయోగించకుండా ఉండాలని, దాని స్థానంలో “కార్మిక శక్తి” వంటి సముచితమైన, గౌరవప్రదమైన పదాన్ని వాడాలని సురేంద్రన్ అన్ని సభ్య దేశాలకు విజ్ఞప్తి చేశారు.

సమానమైన వ్యవహారం, గౌరవం, మర్యాద అనే సూత్రం, వేగంగా విస్తరిస్తున్న ప్లాట్‌ఫామ్, గిగ్ ఎకానమీలో నిమగ్నమైన కార్మికులతో సహా ప్రతి వర్గం కార్మికులకు వర్తించాలని ఆయన సూచించారు. గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులకు సామాజిక భద్రతా రక్షణలను విస్తరించడంలో భారత ప్రభుత్వం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను ఆయన అభినందించారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఏ కార్మికుడూ వెనుకబడిపోకుండా చూసే దిశగా ఈ చర్యలు ముఖ్యమైన ముందడుగులను సూచిస్తాయని చెప్పారు.