News

జాబిల్లిపై రాత్రిని తట్టుకొని నిలిచిన జపాన్‌ స్లిమ్‌..

200views

జపాన్‌ మూన్‌ ల్యాండర్‌ మరో మైలురాయిని దాటింది. జాబిల్లిపై రాత్రిని తట్టుకొని నిలిచింది. సోమవారం ఉదయం జపాన్‌ స్పేస్‌ ఏజెన్సీ (జాక్సా) ఈ విషయాన్ని ఎక్స్‌లో వెల్లడించింది. ‘‘నిన్న రాత్రి స్లిమ్‌కు ఒక కమాండ్‌ పంపించగా, దానికి స్పందన వచ్చింది. అది రాత్రి వేళ కూడా కమ్యూనికేషన్‌ సామర్థ్యాన్ని కాపాడుకున్నట్లైంది’’ అని పేర్కొంది. ఇక్కడ మధ్యాహ్నం వేళ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతుండటంతో కమ్యూనికేషన్‌ పరికరాలు వేడెక్కుతాయి. దీనిని దృష్టిలోపెట్టుకొని వాటిని తాత్కాలికంగా నిలిపివేశారు. వేడి తగ్గిన తర్వాత తిరిగి యాక్టివేట్‌ చేసేందుకు సన్నాహాలు చేశారు. ఈ గ్రహంపై రాత్రి సమయం 14 రోజులు ఉంటుంది. ఆ సమయంలో ఉష్ణోగ్రతలు-200 డిగ్రీలకు పడిపోతాయి. ఎండ అందకపోవడంతో సౌర ఫలకాలు నిరుపయోగంగా మారతాయి. దీంతో బ్యాటరీలు పనిచేయవు.

వాస్తవానికి స్లిమ్‌ జనవరిలో చంద్రుడిపై ఇబ్బందికరంగా ల్యాండ్‌ అయింది. దీనిని హార్ష్‌ ల్యాండింగ్‌కు అనువుగా తయారుచేయలేదు. గతంలో చందమామ పైకి వెళ్లిన ల్యాండర్లు 10కి.మీ. వెడల్పైన జోన్‌ను లక్ష్యంగా పెట్టుకోగా.. స్లిమ్‌ కేవలం 100 మీటర్ల వెడల్పైన ల్యాండింగ్‌ జోన్‌ను లక్ష్యంగా విధించుకొని, ఆ పరిధిలోనే దిగింది. దీంతో జాబిల్లిని చేరుకున్న అయిదో దేశంగా జపాన్‌ అవతరించింది. అయితే స్లిమ్‌ మామూలు స్థితిలో కాకుండా.. తలకిందులుగా ల్యాండ్‌ అయింది. ఫలితంగా సోలార్‌ ప్యానెళ్లపై ఎండ పడని స్థితి నెలకొంది. కానీ, ఆ తర్వాత సూర్యుడి గమనం మారడంతో వీటిపై వెలుగు పడటం మొదలైంది. దీంతో కొన్ని ఫొటోలను తీసి భూమికి పంపింది. ఏకంగా 10 శిలలను అది శోధించింది. ఆ తర్వాత మళ్లీ జాబిల్లిపై రాత్రి మొదలుకావడంతో తిరిగి నిద్రావస్థలోకి జారుకొంది.

ఇక గతవారం జపాన్‌ అంతరిక్ష పరిశోధనలో మరో అడుగు ముందుకేసింది. దాని హెచ్‌3 రాకెట్‌ విజయవంతంగా చిన్న, మైక్రో ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చింది.