News

విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ‘వందేమాతరం’ 150 వసంతాల మహోత్సవాలు

11views

అమర దేశభక్తి గీతం ‘వందేమాతరం’ రచనకు 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా విశేష కార్యక్రమాలను నిర్వహించనుంది. మహాకవి బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన ఈ గీతం భారత జాతీయ చైతన్యానికి, స్వాతంత్ర్య సమర స్ఫూర్తికి, మాతృభూమి పట్ల అచంచల భక్తికి ప్రతీకగా నిలిచిందని విద్యాభారతి పేర్కొంది.

ఈ నేపథ్యంలో “సంపూర్ణ వందేమాతరం సామూహిక గానం” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించాలని విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ నిర్ణయించింది.

పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా 2026 సెప్టెంబర్ 25న ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని విద్యాభారతి విద్యాలయాలు, పోషక గ్రామాలు, పట్టణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రాంగణాలు, బస్టాండ్లు, జిల్లా కేంద్రాలు, పూర్వ విద్యార్థులు మరియు ఆచార్యులు సేవలందిస్తున్న విద్యాసంస్థల్లో ఒకే సమయంలో సంపూర్ణ వందేమాతరం గీతాన్ని సామూహికంగా ఆలపించనున్నారు.

విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు మరియు సమాజంలోని అన్ని వర్గాలలో దేశభక్తి, మాతృభూమి పట్ల సమర్పణ భావనను పెంపొందించడం, భావితరాలలో వందేమాతరం గీతం పట్ల గౌరవాన్ని మరింత బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ తెలిపింది.

గిన్నిస్ వరల్డ్ రికార్డు దిశగా ప్రయత్నం
ఒకే తేదీ, ఒకే సమయం, ఒకే విధానంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు సంపూర్ణ వందేమాతరం గీతాన్ని ఆలపించేలా కార్యక్రమాన్ని నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం పాల్గొనే వారి వివరాల నమోదు, వీడియో చిత్రీకరణ, డ్రోన్ ఫొటోగ్రఫీ, హాజరు ధ్రువీకరణ వంటి అంశాలపై ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు.ఈ మహోత్సవంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థల సిబ్బంది, నిర్వహణ సమితుల సభ్యులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, పూర్వ ఆచార్యులు, హితైషులు మరియు ఇతర పౌరులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.

సామూహిక గానానికి ముందు భారతమాత చిత్రపటానికి పుష్పార్చన, దీపప్రజ్వలన, వందేమాతరం చరిత్ర మరియు 150 వసంతాల ప్రాధాన్యంపై ప్రసంగాలు నిర్వహించనున్నారు. అనంతరం సంపూర్ణ వందేమాతరం గీతాన్ని స్వరబద్ధంగా, లయబద్ధంగా సామూహికంగా ఆలపించనున్నారు.జూన్ నెల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు వందేమాతరం గీతాన్ని శుద్ధ ఉచ్చారణతో నేర్పించనున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో పోటీలు, సమావేశాలు నిర్వహించి, సెప్టెంబర్‌లో తుది సామూహిక గాన అభ్యాసాలు చేపట్టనున్నారు.

వందేమాతరంపై విద్యావేత్తల గోష్టులు
సెప్టెంబర్ 26 నుండి నవంబర్ 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా విద్యాభారతి ఆధ్వర్యంలో ప్రత్యేక విద్వత్ గోష్టులు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో వందేమాతరం చరిత్ర, స్వాతంత్ర్యోద్యమంలో దాని పాత్ర, భారతీయ సంస్కృతి మరియు జాతీయ జీవితంలో దాని ప్రాధాన్యంపై చర్చలు జరగనున్నాయి.

విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాలను క్రమశిక్షణతో, వైభవోపేతంగా నిర్వహించి జాతీయ చైతన్యాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చింది.