ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రదార్శనికులు – 28 ; దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

250views

డా॥ కట్టమంచి రామలింగారెడ్డి గారి అంచనాల ప్రకారం, ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి స్థానం స్వాతంత్య్ర సమరభేరి నినదించటంలో అగ్రస్థానం, అయితే వారికి రావలసినంత కీర్తి లభించలేదు. మేధావుల వరుసలో వున్న సర్వేపల్లి రాధాకృష్ణ గారు అగ్రస్థానానికి వెళ్ళారట. కట్టమంచి వారు రెండవ స్థానంలోనే పదిలంగా ఉన్నానని చెప్పుకున్నారు. వారే స్వయంగా చెప్పిన మాట “ఎందరో మహావ్యక్తుల ఉపన్యాసాలు విన్నానని, అందరిలో గోపాలకృష్ణయ్య గారే మిన్న” కట్టమంచి రామలింగారెడ్డి గారు అన్నారు.

దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి జీవితం పూలపాన్పు కాదు ఎన్నో కష్టాలతో, విషాదాలలో గడిచింది. అయితే ఆయన జీవితం ఉత్కంఠ భరితం. వీరి ఆలోచన ధోరణి ఇతరులకంటే విచిత్రంగా, భిన్నంగా వుండేది. ఇటువంటి ఆలోచనలే స్వాతంత్య్ర సమరంలో ఐక్యతకు, త్యాగానికి స్ఫూర్తి దాయకంగా నిలిచాయి.

కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలులో 1889 జూన్ 2 న గోపాలకృషయ్య గారు తండ్రి దుగ్గిరాల కోదండరామస్వామి, తల్లి సీతమ్మ గార్లకు జన్మించారు. ఆయన దురదృష్టం పుట్టంగానే వరించింది. పుట్టిన మూడవ రోజునే తల్లిని, మూడవ ఏటనే కనబడు తండ్రిని పోగొట్టుకున్నారు. వారి నాయనమ్మ రాజమ్మ చాలాకాలం సాకింది. జీవితం ప్రారంభమైన నాటి నుండి విషాదానికి ప్రతీకమైన శివరంజని రాగమైంది.

రేపల్లె తాలూకాలోని కూచినపూడిలో పినతండ్రి శివరామయ్య గారివద్ద కొంత కాలం పెరిగారు. అక్కడే వారికి దైవభక్తి అలవడింది. తను గుంటూరులో విద్యనభ్యసించేటప్పుడు అరవిందుల వారి రచనలు, తిలక్ (బాలగంగాధర్) వారి రచనలు స్ఫూర్తినిచ్చాయి. అరవిందుల వారినుండి దేశభక్తి, స్వాతంత్ర్య పోరాట పటిమ వారి రక్తంలో జీర్ణించుకుని పోయింది. ఈ సందర్భంలోనే మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోయారు. Failures are the Stepping Stones for Success అన్నట్లు, పినతండ్రి సలహా మేరకు బాపట్ల చేరి, చదివి 1906లో మెట్రిక్యులేషన్ పరీక్ష పాస్ అయ్యారు. ఆయన జీవితాన్ని మలుపుతిప్పిన అధ్యాపకుడు, ప్రసిద్ధులు, పంచాప కేశ అయ్యర్ వీరికి గురువు. జీవితం గడవటానికి బాపట్ల తాలూకా ఆఫీస్ లో గుమాస్తాగా చేరాడు గోపాలకృష్ణయ్య, అక్కడి పరిస్థితులు నచ్చలేదు. తాసిల్దార్ల వ్యవహారంతో ఆయనకు విసుగు వచ్చింది. ఇంటికి ఉత్తరం వ్రాస్తూ వీధి, వీధి, ఇల్లు, ఇల్లు తిరిగి భిక్షమెత్తుకోవటం, ఈ సర్కారు నౌకరీ కంటే మంచిదని నాకు తోచిందని ఉత్తరం వ్రాసి, ఉద్యోగానికి రాజీనామా చేశారు. అటువంటి రాజీలేని మనస్తత్వం దుగ్గిరాల వారిది.

గుంటూరు కాలేజ్లో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఆయనకు నడింపల్లి నరసింహారావు ఆయన సహపాఠి. ఇద్దరూ ప్రాణస్నేహితులు, వారితోపాటు జొన్నవిత్తుల గురునాధం, బహుమేధావి. ఆంధ్రోద్యమానికి మూలపురుషుడు, వారి సహచర్యంతో గురునాథంగారిని ఆదర్శంగా ఎంచుకున్నారు. నడింపల్లి నరసింహరావుగారు ఆగర్భ శ్రీమంతుడు. ఉన్నతవిద్యకు ఇంగ్లండు వెళుతూ తనతో కన్నా ఇంగ్లండు రమ్మని ప్రోత్సహించారు. ఇద్దరూ ఇంట్లో వారికి తెలియకుండానే లండన్ పయనమయ్యారు. 1911 లో నడింపల్లి యం. ఏ (హనర్సు) Baristor చేసి దుగ్గిరాల, ఆలోపు కంటే ముందుగానే ఇండియా వచ్చారు. ఇతర వ్యాపకాలతో చదువుపై కేంద్రీకరించక, ఆలస్యంగా 1916లో డిగ్రీ ఆలస్యంగా అందుకున్నారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. 1917 రాజమండ్రి ట్రయినింగ్ కళాశాలలో ఉపన్యాసకునిగా, వీరభద్రపురంలో కాపురం వుంటూ, గుర్రం మీద కళాశాలకు వచ్చేవాడు. అది అక్కడ అధికారులకు కంటగింపయింది. గోపాలకృష్ణయ్య గారి చలాకీతనం ఆంగ్లేయులకు నచ్చలేదు. ఒక్కోసారి కళాశాల గేట్లు మూయించేవారు. అక్కడ ప్రిన్సిపాల్ పదవి మానుకుని బందరు జాతీయ కళాశాల వారి ఆహ్వానం మేరకు ప్రిన్సిపాల్ గా చేరారు. ప్రముఖ దేశభక్తులు కోపల్లె హనుమంతరావు, కృష్ణాపత్రిక సంపాదకులు ముట్నూరి కృష్ణారావు, కాంగ్రెసు నాయకుడు, ఆంధ్రబ్యాంకు వ్యవస్థాపకుడు డా॥ పట్టాభి గార్ల సహచర్యం బందరులో లభించింది. అయితే ఆయన అక్కడ యిమడలేదు. 1918 సంవత్సరం ఉద్యోగాన్ని చాలించి స్వేచ్ఛాజీవి అయినారు. దారిద్య్రం వెన్నాడింది. మిత్రులు వావిళ్ళ ప్రచురణ స్థాపకులు వావిళ్ళ వెంకటేశ్వరశాస్త్రి ఆదుకుని వీరిచే “రాజతంత్రం’ అనే పుస్తకం వ్రాయించారు.

ఆంధ్రరత్నగా ప్రసిద్ధి చెందిన గోపాలకృష్ణయ్య గారు మధుర గాయకుడు, ప్రతి సభలోనూ శ్రీ కృష్ణ కర్ణామృతం, గీత గోవిందం, అష్టపదులను గానం చేసేవారు. శృంగారవీధి’ కావ్యరచనకు స్పూర్తి దుగ్గిరాల వారి మధుర గానమేనని కవిసమ్రాట్ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, రామాయణ కల్పవృక్షం వ్రాసిన విశ్వనాథ సత్యనారాయణ గారు వారి రచనలలో తెలియచేశారు. ఆంధ్రమహాసభ నెల్లూరులో జరిగినప్పుడు కొండా వెంకటప్పయ్య గారు అధ్యక్షత వహించారు. దుగ్గిరాల వారు అక్కడే వున్న మహకవి రాయప్రోలు సుబ్బారావు గారిచే ఆంధ్రుల ప్రాచీన వైభవాన్ని కీర్తిస్తూ కర్తవ్వాన్ని బోధిస్తూ రాయప్రోలు వారిచే పెన్నానది ఒడ్డున కూర్చుని
“పట్టణమున బౌద్ధులు విశ్వ విద్యాలయము స్థాపించు నాడు,
ఓరుగల్లున రాజవీర లాంఛనముగ బలు శస్త్రశాలలు నిలుపునాడు,
విద్యానగర రాజవీధుల గవితకు, పెండ్లి పందిళ్లు కప్పించునాడు,
పొట్నూరి సమీపమున నాంధ్ర సామ్రాజ్య దిగ్విజయస్తంభ మెత్తించునాడు,
ఆంధ్ర సంతతికే మహితాభిమాన దివ్యదీక్షా సూర్తి తీవరించే,
నా మహవేశ మర్ధించి యాంధ్రులార చల్లుడాంధ్రలో కమున అక్షతలు నేడు”
అన్న రాయప్రోలు వారి రచన దుగ్గిరాల వారి కంఠాన శ్రావ్య గాన మయింది తెలుగు వారి గుండెలలో స్వాతంత్య్ర స్ఫూర్తి రగిలించింది. ఆంధ్రరాష్ట్ర వాంఛను రేకెత్తించింది. ఆంధ్ర మహాసభ పీఠం నుంచే దుగ్గిరాల మాంతేగు, ఛెమ్స్ ఫర్దు సంస్కరణలను తీవ్రంగా విమర్శించారు. అదే స్ఫూర్తితో చీరాలలో ‘రామదండు’ స్థాపించారు. ఎన్నో పోరాటాలకు ‘రామదండు’ వేదికయింది. రామదండు సైన్యం ఎర్రని చొక్కా, ఎర్రని తలగుడ, ఎర్రని కుంకుమ బొట్టు ధరించి ‘Red Shirts గుర్తింపు పొందింది. రామదండు వాలంటీర్లు త్యాగాలకు మారుపేరు. మహాత్మాగాంధీగారితో మొదలుకొని పెద్దలంతా రామదండు సేవలను ప్రశంసించారు.

దుగ్గిరాల ప్రసంగాలు, పాటలు, పద్యాలు విద్యార్థులపై విశేష ప్రభావం చూపాయి. స్వాతంత్ర్య పోరాట పటిమను పెంచాయి. గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం, చీరాల పేరాల మహోద్యమంలో దుగ్గిరాల వారి పాత్ర ప్రముఖమైంది. బ్రిటీష్ పార్లమెంటును కుదిపివేశాయి, దుగ్గిరాల గోపాలకృష్ణయ్యను బ్రిటిష్ వారు, ఎన్నో నిర్బంధాలకు గురిచేశారు. అరెస్టు చేసి తిరుచురాపల్లి జైలుకు తరలించారు. 1922 అక్టోబరు 21న విడుదలైన దుగ్గిరాలకు స్వాగతం పలకటానికి నాయకులు రాజాజీ, వి.వి.యస్. అయ్యర్, ఇ.వి. రామస్వామి, యాకుబ్ హుస్సేన్, కె. సంతానం విచ్చేశారు. గొప్ప ఊరేగింపుతో పురమందిరానికి తోడ్కొని వెళ్ళారు. అప్పుడే శ్రీరంగం వెళ్ళి అమ్మవారిని దర్శించి, అమ్మవారిపై సంస్కృతంలోపన్నెండు శ్లోకాలు వ్రాసి సమర్పించారు. తిరుచురాపల్లిలో వున్నప్పటి తత్వచింతన, దుగ్గిరాలకు జ్ఞానోదయమైంది. దానికి నవీన బ్రాహ్మణ మతం అనే పేరు పెట్టి, కులం, మతం, వర్ణవ్యవస్థకు తావులేని విధంగా బ్రాహ్మణులను మార్చటమే పరమార్థంగా పని చేశారు. తాను జైలు జీవితంలో పొందిన అనుభవాలను ఎన్నో ఉన్యాసాలలో చెప్పేవారు. భగవంతునిపై విశ్వాసం ప్రకటించేవారు. దేశోద్దారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులుగారు ఆంధ్రరత్నను అనుసరించవలసిందిగా కోరారు.

దుగ్గిరాలను దురదృష్టం వెన్నాడింది. అసూయాపరులు కుట్రలు చేశారు. చీరాల-పేరాల ఉద్యమం దేశమంతా ప్రశంసిస్తుంటే ఒక్క ప్రకాశం పంతులు గారు తప్ప మిగతావారు చేయందించలేదు. అయినా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వెనుకకు తగ్గలేదు. వారి సాహితీ ప్రతిభ ‘సాదన’ పత్రిక రూపంలో ముందుకు సాగింది. ఈ నాటినేతలు శీర్షికన మహాత్మగాంధీ, మోతీలాల్, సి. ఆర్. దాస్ల గురించి వ్రాసే వారు పత్రికలో. “నవీన ఉపనిషత్తుకు స్వరాజ్యం ఒక సేద్యం” అన్న నినాదం స్వాతంత్రోద్యమంలోనినాదమయింది.

జీవించినది 38 సంవత్సరాలే, అల్లూరి సీతారామరాజు గుండెకు తూటా ఎక్కుపెట్టిన “రూధర్ ఫర్డ్”కు ఆంధ్రరత్న అన్నా గౌరవం లేదు. అయినా ఆంగ్లజాతికి ఆంధ్రరత్న గొడ్డలిపెట్టు.

జీవనచరమాంకంలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారిని దారిద్య్రం వెన్నాడింది. చీరాలలో కొంతస్థలం అమ్మి, గుంటూరులో ఊరికి చివరగా ఒక ఇల్లు నిర్మించుకుని, పేదలందరకు గృహప్రవేశం రోజున మృష్టాన్న భోజనాలు వడ్డించారు. ఇది 1928 మే 28న జరిగింది. అయితే ఒక నెలలోనే జూన్ 10న తనకు మరణ సమయముఆసన్నమైనదని ఒక చాప పరిచి వుంచమని తనవారిని కోరాడు. ఇష్టదైవాన్ని స్మరిస్తూ రాత్రి 10.45 ని||లకు శరీరాన్ని వదిలారు.