
ప్రతి మహిళా న్యాయవాది విశ్వగురువు కావాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ పిలుపునిచ్చారు. శనివారం ఉదయం విశాఖలో మహిళా న్యాయవాదుల సమాఖ్య ఆధ్వర్యంలో ‘మహిళా సాధికారత-రాజ్యాంగ ఆవశ్యకత’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ మాట్లాడుతూ ‘మహిళలు సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం సాధించడంతోపాటు రాజ్యాంగంలోని ప్రాథమిక బాధ్యతలనూ నిర్వర్తించాలి. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల్లో వివక్షకు గురికాకుండా ఉండాలంటే రాజ్యాంగ హక్కులపై పూర్తిస్థాయి పట్టు ఉండాలి. లింగ వివక్షకు గురయ్యే అన్ని రంగాల్లో న్యాయపోరాటం ద్వారా సమానత్వం సాధించాలి. వ్యక్తిగత సమాచార గోప్యతను కాపాడుకోవడానికి నడుం బిగించాలి. సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతోపాటు విద్య, ఉద్యోగ రంగాలలో ఆధిక్యం సాధించాలి’ అని సూచించారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్ మాట్లాడుతూ.. ఇటీవల రాష్ట్రంలో జూనియర్ సివిల్ జడ్జిల ఎంపిక చేపడితే.. అందులో 70శాతం మహిళలు ఉన్నారని తెలిపారు. వారిలో ఆదివాసి మహిళ కూడా ఉండడం గర్వించదగ్గ విషయమన్నారు. విశాఖ న్యాయవాదుల సంఘంలో 1,300 మంది మహిళా న్యాయవాదులు ఉండటం శుభ పరిణామంగా పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు ప్రసంగిస్తూ.. మహిళల అక్రమ రవాణా, లైంగిక వేధింపులు, గృహ హింసను సమూలంగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మైనర్లపై లైంగిక దాడులను నివారించకపోతే భవిష్యత్తులో సమాజం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ.. భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం మహిళా న్యాయవాదుల సమాఖ్య గతేడాది నిర్వహించిన కార్యక్రమాలపై రూపొందించిన ఆల్బమ్‌ను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు కొప్పాక అరుణ, అఖిల భారత మహిళా న్యాయవాదుల సమాఖ్య మాజీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు అమీ యాజ్ఞిక్, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.ఎస్.భానుమతి, జస్టిస్ పి.వి.జ్యోతిర్మయి, జస్టిస్ రవి చీమలపాటి, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు, విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్, రాష్ట్ర బార్ కౌన్సిల్ ఛైర్మన్ గంటా రామారావు తదితరులు పాల్గొన్నారు.





