News

తిరుమలలో జూన్ 26 నుంచి జ్యేష్ఠాభిషేకం

30views

తిరుమల‌లోని శ్రీవారి ఆలయంలో జూన్ 26 నుంచి 28వ‌ తేదీ వరకు సాలకట్ల జ్యేష్ఠాభిషేకాన్ని మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో జ్యేష్టా నక్షత్రం ముగిసేట్లుగా మూడు రోజుల‌ పాటు తిరుమల‌ శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు. సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును ‘అభిధ్యేయక అభిషేకం’’ అని కూడా అంటారు. తరతరాలుగా అభిషేకాల‌తో అత్యంత ప్రాచీనులైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తారు.

మొదటిరోజు శ్రీ మయప్పస్వామివారికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి, హోమాలు, అభిషేకాలు పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీ స్వామివారికి వజ్రకవచాన్ని అలంకరిస్తారు. రెండో రోజు ముత్యాల‌ కవచం సమర్పిస్తారు. మూడో రోజు తిరుమంజనాదులు పూర్తిచేసి, బంగారు కవచాన్ని పునఃసమర్పిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే ఏడాది జ్యేష్టాభిషేకం సమయంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే వివిధ ఉత్సవాల్లో పాల్గొంటారు. కాగా జ్యేష్ఠాభిషేకాన్ని పుర‌స్కరించుకుని జూన్ 28వ తేదిన కల్యాణోత్సవం, ఊంజ‌ల్ సేవ‌, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవ‌ల‌ను తితిదే ర‌ద్దు చేసింది.