
పురిపండా అప్పలస్వామిగారు బహుభాషా కోవిదుడు. సాహితీవేత్త, మానవతావాది, జర్నలిస్టు, అనువాదకుడు, ఇంకా చాలా చాలా… 1904 నవంబర్ 13 న విజయనగరం జిల్లా సాలూరులో జన్మించారు. 1921లో తండ్రి మరణానంతరం ఉద్యోగాన్వేషణలో విశాఖపట్నం చేరుకున్నారు. సర్వే డిపార్టుమెంట్లో ఆఫీసు బాయ్ గా చేరారు.ఆ రోజుల్లో బ్రిటీషు ప్రభుత్వం గాంధీజీని అరెస్టు చేసినందుకు నిరసనగా అప్పలస్వామి ఉద్యోగం వదలిపెట్టి జాతీయోద్యమంలో పాలుపంచుకున్నారు. సహాయనిరాకరణ, హరిజనోద్ధరణ, ఖాదీ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. విశాఖలో ఆలిండియా చరఖా సంఘం ఆర్గనైజర్ గా పనిచేశారు. జర్నలిజంలో విశేష పరిజ్ఞానం గల అప్పలస్వామి స్వశక్తి అనే జాతీయ వార్తాపత్రికకు అసోసియేట్ ఎడిటర్ గా పనిచేశారు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా ఆంధ్రపత్రికలో పన్నెండేళ్లపాటు వ్యాసపరంపర గుప్పించారు. ఆయన ప్రచురించిన వైశాఖి మాసపత్రిక సర్వత్రా ప్రశంసలందుకుంది. మహాకవి శ్రీశ్రీని వెలుగులోకి తెచ్చిన ఘనత పురిపండాదే. అప్పలస్వామి అభ్యుదయ రచయితల సంఘం – అరసం – అధ్యక్షుడిగా అనేక సంవత్సరాలు వ్యవహరించారు.
విశాఖపట్నం ఖాదీ భండార్ మేనేజర్ గా నియమితులయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ లలిత కళా అకాడెమి, సాహిత్య అకాడెమీల సభ్యుడు. కళింగాంధ్ర గ్రంథ్రాలయ మహాసభ విశాఖపట్నంలో పురిపండా అధ్యక్షతనే జరిగింది. రామాయణ మహాభారతాలను వ్యావహారిక ఆంధ్రభాషలో, వచనంలో రచించి, ఆ గ్రంథాలను తెలుగు పాఠకులకు అందించారు. దీనదయాళ్ ఉపాధ్యాయ హిందీలో రచించిన జగద్గురు శ్రీ శంకరాచార్య జీవితాన్ని తెలుగుజేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం 1973లో కళాప్రపూర్ణ బిరుదుతో ఆయనను సత్కరించింది. 1982 నవంబర్ 18న పురిపండా స్వర్గస్తులయ్యారు.





