
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్య నగరంలోని రామ జన్మభూమి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిత్యం భారీ సంఖ్యలో భక్తులు రామయ్య దర్శనానికి తరలివస్తున్నారు.భక్తుల రద్దీ అధికమవుతున్న నేపధ్యంలో అయోధ్యలో బాలరాముని ఆలయానికి వెళ్లేందుకు మరో కారిడార్ నిర్మాణాన్నిచేపట్టినట్లు శ్రీ రామ జన్మభూమి తీర్ద క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ఈ మార్గానికి సుగ్రీవ్ మార్గ్ అని నామకరణం చేశామని తెలిపింది.
ఈ మార్గం శ్రీరామ జన్మభూమి మరియు హనుమాన్ గర్హి గుండా వెళుతుందని, సుగ్రీవ మార్గం పొడవు 290 మీటర్లు, వెడల్పు 17 మీటర్లు ఉంటుందని పేర్కొంది. ఈ మార్గ నిర్మాణానికి రూ.11.81కోట్ల బడ్జెట్ ఆమోదం పొందిందని ఇందులో రూ.5.1 కోట్లు భూసేకరణకు వినియోగించనున్నట్లు వివరించింది. బాల రాముని దర్శనానికి వచ్చిన రామభక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ నిర్మాణాన్ని చేపట్టినట్లు ట్రస్ట్ స్పష్టం చేసింది.





