News

శ్రీశైలం మహాకుంభాభిషేకం.. అమాత్యుని కోసం ముందుగానే ముహూర్తం ?

264views

శ్రీశైలంలో నిర్వహించ తలపెట్టిన మహాకుంభాభిషేకం ముహూర్తం ఓ అమాత్యుని కోసం ముందుకు జరిగింది. పీఠాధిపతులు పేర్కొన్న ముహూర్తాల కంటే అమాత్యుని సూచనకే దేవాదాయశాఖ ప్రాధాన్యం ఇచ్చింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చేలోపు ఈ క్రతువు పూర్తిచేసి, తన ఆధ్వర్యంలోనే జరిపించానని చూపేందుకు ఆయన చూస్తున్నట్లు తెలిసింది. శ్రీశైలంలో మహారుద్ర శతచండీ సహిత వేదస్వాహాకార పూర్వక మహాకుంభాభిషేకాన్ని ఈ నెల 16 నుంచి 21 వరకు నిర్వహిస్తున్నారు. వాస్తవంగా ఇది అసలైన ముహూర్తం కాదని తెలిసింది. గతేడాది మే 12 నుంచి 17 మధ్య జరగాల్సి ఉంది. అప్పట్లో ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుడైన కీలకస్వామి, ఓ అమాత్యునికి మధ్య విభేదాలతో వాయిదా వేశారు. తర్వాత నవంబరు 15 నుంచి 19 మధ్య నిర్వహించాలని నిర్ణయించినా, దీనికి సైతం కీలకస్వామి సమ్మతించలేదు. దీనిపై అఖిలభారత వీరశైవ ధార్మిక ఆగమ పరిషత్తు హైకోర్టును ఆశ్రయించింది. చివరకు మహాకుంభాభిషేకానికి తేదీలు ఖరారు చేయాలంటూ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ముహూర్తాలు సూచించాలని శ్రీశైల జగద్గురు పీఠం, కంచికామకోటి పీఠం, శృంగేరీ శారదాపీఠం, విశాఖ శారదాపీఠం, పుష్పగిరి పీఠాధిపతులను, ప్రవచనకర్త సామవేదం షణ్ముఖశర్మను దేవాదాయశాఖ కోరింది. వీరంతా మార్చి నెలలో వేర్వేరు ముహూర్తాలను నిర్ణయించారు.

కోడ్‌ వచ్చేస్తోంది.. ముందే చేయండి: వచ్చే నెలలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుండటంతో.. ఆలోపే మహాకుంభాభిషేకం పూర్తిచేయాలని ఓ అమాత్యుడు దేవాదాయశాఖ అధికారులపై ఒత్తిడి చేసినట్లు తెలిసింది. అందుకే ఈ నెల 16 నుంచి 21 వరకు క్రతువు నిర్వహించేలా ఖరారు చేసినట్లు తెలిసింది.

source : ఈనాడు