News

భక్తులు సంతృప్తి చెందేలా అర్చకత్వం : శ్వేత సంచాలకులు భూమన్‌

342views

భక్తులు సంతృప్తి చెందేలా అర్చకత్వం చేయాలని శ్వేత సంచాలకులు భూమన్‌ అన్నారు. మంగళవారం శ్రీవేంకటేశ్వర ఉద్యోగుల శిక్షణ సంస్థ(శ్వేత) ఆధ్వర్యంలో మూడు రోజుల పునశ్చరణ తరగతులు తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి పునశ్చరణ తరగతులతో అర్చకులు పాండిత్యాన్ని సంపాదించవచ్చన్నారు. వైఖానస ఆగమంలోని నిగూఢమైన విషయాలను తెలుసుకుని, భక్తులు సంతృప్తి చెందేలా అర్చకత్వం చేయాలని కోరారు. ఈ తరగతుల్లో ఆరోగ్యసూత్రాలపై శిక్షణ ఇస్తామన్నారు. పాంచరాత్ర, శైవాగమ అర్చకులకు పునశ్చరణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు.

ఎస్వీ వేదవర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ ఆగమాలు సాక్షాత్తు భగవంతుడు ఉపదేశించినవని, అలాంటి ఆగమాల్లో పేర్కొన్న విధంగా ఆలయాల్లో సంప్రదాయబద్ధంగా అర్చకత్వం చేయాలని కోరారు. ఇలాంటి పునశ్చరణ తరగతులు అర్చక వ్యవస్థ పటిష్టానికి ఎంతో దోహదం చేస్తాయన్నారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ కట్టు, బొట్టు సంప్రదాయాలను పాటించి అర్చకులు సమాజంలో ఆదర్శవంతంగా నిలవాలన్నారు. ఇలాంటి పునశ్చరణ తరగతులతో అర్చకుల నైపుణ్యం మరింత పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు పి.సీతారామాచార్యులు, టీటీడీ ఆలయాల వైఖానస అర్చకులు పాల్గొన్నారు.