News

కబేళాల నుంచి గోవులను కాపాడిన గో సేవా సంఘ్

225views

రాజమహేంద్రవరంలో ఆదివారం అక్రమంగా నిర్వహిస్తున్న గోవధ కబేళా కేంద్రంపై పోలీసుల సహకారంతో గో సేవా సంఘ్ గో సంరక్షకులు దాడి చేసి మూగ జీవాలని బతికించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జాంపేట ప్రాంతంలోని మదన్‌సింగ్‌పేటలో జనా వాసాల మధ్య హబీబుల్లా ఖాన్‌ రేకులతో షెడ్లు వేసి గోమాంస కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. దుర్వాసనతో స్థానికులు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోవడంలేదు. ఆదివారం రాష్ట్రీయ గో రక్షా వాహిని గో సేవా సంఘ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వైష్ణవ్‌ దినేశ్‌ సంఘ్‌ సభ్యులతో అక్కడికి వెళ్లి 112కి ఫోన్‌ చేయగా, వెంటనే వన్‌టౌన్‌ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే వధించిన ఒక గోవు కళేబరం అక్కడ ఉండగా.. వధించడానికి సిద్ధంగా ఉన్న మరో గోవును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేంద్రాన్ని నడుపుతున్న హబీబుల్లాఖాన్‌, మహమ్మద్‌ షపీవుల్లాను అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్‌ 429 రెడ్‌ విత్‌ 34, జంతువులపై క్రూరత్వ నిషేధ చట్టంలోని సెక్షన్‌ 11(1)(ఎ) ప్రకారం కేసు నమోదు చేశారు.