ArticlesNews

స్వాతంత్రోద్యమంలో ఆంధ్రనారీమణులు – 9 ; రామ సుబ్బమ్మ

612views

భారతీయ సమాజంమీద వ్యతిరేక ప్రచారం పనికట్టుకుని మరీ చేశారు పాశ్చాత్యులు. తమ వలసపాలన స్థిరత్వానికి జరిగిన కుట్రలో భాగమే భారతీయ సమాజాన్ని చిన్నబుచ్చటం. మహిళలకు సరైన పాత్ర నివ్వని సమాజం, మహిళలను గడప దాటి బయటకు రానివ్వని కట్టుబాట్లు పెట్టిన సమాజం అంటూ బ్రిటీష్ పాలకులు చేసిన దుష్ప్రచారం ఆ తర్వాతి కాలపు చరిత్రకారులు కొనసాగించటమే మన దురదృష్టం. తొలి భారత స్వతంత్ర సమరం చేసిన వీరనారి ఝాన్సీలక్ష్మీబాయి మహిళ. ఆమెబాటలో స్వాతంత్ర పోరాటంలో నాటి నుండి ఎందరెందరో మహిళలు పాల్గొని కారాగారాలకు వెళ్ళారు. ఆంధ్రదేశంలో అటువంటి మహిళామణులు ఎందరో ఉన్నారు. గర్భిణిగా జైలుకు వెళ్ళి కారాగారంలోనే ప్రసవించిన వారు, తమ వైధవ్యాన్ని సవాలుగా తీసుకుంటూనే అద్భుత ప్రసంగాలతో మహిళలను పోరాటంలోకి తీసుకువచ్చిన మహిళానేతలు ఎందరెందరో. వారిలో ఒకరు శ్రీమతి రామ సుబ్బమ్మ.

స్త్రీలు గడప దాటడమే పాపంగా ఉన్న రోజుల్లో… స్త్రీలు గట్టిగా మాట్లాడితేనే తప్పుగా పరిగణించే రోజుల్లో… అవిద్య, అసమానత స్త్రీ జాతిని నిలువునా నిర్వీర్యం చేస్తున్న రోజుల్లో… స్వాతంత్య్ర సాధనకు, ఆంధ్ర రాష్ట్రావతరణకు, మహిళా హక్కుల పరిరక్షణకు, విద్యాభివృద్ధికి జీవితాంతం కృషిచేసి, స్త్రీ శక్తిని చాటుకున్న ఆదర్శ మహిళామూర్తి శ్రీమతి రామసుబ్బమ్మ. స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడు కడప కోటిరెడ్డి గారి సతీమణి వీరు.

చీకట్లు ముసిరిన భారతంలో…. చీకట్లో మగ్గుతున్న ఎందరో స్త్రీలకు రామసుబ్బమ్మ మార్గదర్శకంగా నిలిచింది. తన తెలివితేటలతో ఎందరో స్త్రీలని ప్రభావితం చేయగలిగింది. జాతీయ భావాలతో స్వాతంత్ర్య సమరంలో కీలకపాత్ర పోషించి భారతీయ స్త్రీల ఔన్నత్యాన్ని ఆనాటి బ్రిటిష్ సామ్రాజ్యానికి చాటిచెప్పింది. కడప జిల్లా, జమ్మలమడుగు తాలూకా, సుద్దపల్లె వాస్తవ్యులు కొనుదుల చిన్న రామచంద్రారెడ్డి, అచ్చమాంబ దంపతులకు 1902 లో రామసుబ్బమ్మ జన్మించారు. ఆమెకు ఊహ తెలిసే నాటికి భారతదేశంలో పరిస్థితులు అగమ్యగోచరంగా వున్నాయి. తన కుటుంబ సభ్యుల మాటల్లో స్వాతంత్య్ర కాంక్ష గురించి, జరుగుతున్న పోరాటం గురించి తెలుసుకున్నది. తనలో తానే జాతీయ భావాల్ని పెంపొందించుకున్నది.

1917 వ సంవత్సరంలో ఆమె పదహైదు సంవత్సరాల వయసులో ఆమెకు కడప కోటిరెడ్డితో వివాహమయింది. అప్పటికి కోటిరెడ్డి పుష్కలమైన జాతీయోద్యమ భావాలతో దేశంకోసం స్వాతంత్య్ర కాంక్షతో ఆరాటపడడ్తున్నాడు.

కోటిరెడ్డి ఆమె మనసును, ఆమెలోని ధైర్యాన్ని గుర్తించాడు. ఆమె సాధారణ గృహిణి మాత్రమే కాదని, పదుగురికి ప్రేరణనిచ్చి ముందుకు నడిపించగల సమర్థవంతమైన నాయకురాలని అర్ధం చేసుకున్నాడు. భర్త ఆదరాభిమానాలతో దేశం కోసం ఏ త్యాగం చేయడానికైనా సిద్ధపడింది రామ సుబ్బమ్మ. కాగా కోటిరెడ్డి ఆమెకు ఆంగ్లం రాకపోవడం విషయమై కొంత నిరుత్సాహపడ్డాడు. ఎందుకంటే స్వాతంత్ర్య పోరాటం ఒక ప్రాంతానికి సంబంధించినది కాదు. అది జాతీయ్య పోరాటం. అన్ని ప్రాంతాల పోరాటయోధులతో కలిసి ముందుకు నడవాలంలి ని భాష అవసరం. అందుకే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆమెకు ఆంగ్లం నేర్పించాడు. తర్వాత తనతోపాటుగా ఆమెను జాతీయోధ్యమంలో ముందుకు నడిపించాడు.

1921వ సంవత్సరం నాటికి రామసుబ్బమ్మ ఆంగ్లభాషలో అరితేరారు. ఇక అదే సంవత్సరం కాంగ్రెసులో చేరి జాతీయోద్యమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అటు ఇంటిని చూసుకుంటూ, ఇటు పోరాటాన్ని కొనసాగిస్తూ అంకితభావంతో పనిచేశారు రామసుబ్బమ్మ. జాతీయోద్యమంలో భాగంగా దేశంలో వివిధ ప్రాంతాలను గండప భర్తతో కలిసి పర్యటించారు. భాష సమస్య లేదు కాబట్టి అన్ని ప్రాంతాల నాయకులతో పరిస్థితులగురించి చర్చించగలిగారు.

1928 ఫిబ్రవరి 3 న సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమంలో తెల్లవాడి తుపాకీకి గుండె చూపి దమ్ముంటే తనను కాల్చమని సవాలు చేసిన టంగుటూరి ప్రకాశం పంతులుగారి తెగువను కళ్ళారా చూసి “దేశంకోసం ప్రాణత్యాగం చేయవటి వచ్చినప్పుడు వెనుకాడవలసిన అవసరం లేదు. మన ప్రాణం ఎందరో వీరులను తట్టిలేపాలి” అనే నిర్ణయానికి వచ్చిన రామసుబ్బమ్మ, జీవితాంతం ఆ నిర్ణయానికి కట్టుబడి జీవించారు.

1930 మార్చి12 న గాంధీజీ మరో 79 మంది సత్యాగ్రహులతో కలిసి సబర్మతి ఆశ్రమంనుండి దండి ఉప్పు సత్యాగ్రహం నడక (390 కిలోమీటర్లు మొదలుపెట్టారు. వారి ప్రేరణతో సముద్రతీరమున్న అన్ని ప్రాంతాలలో ఈ ఉద్యమ ఊపందుకుంది. సరోజినీనాయుడు, పొణకా కనకమ్మ, ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ దువ్వూరి సుబ్బమ్మ, ఉన్నవ లక్ష్మీబాయమ్మ, దుర్గాబాయమ్మ, ప్రకాశం పంతులు బులుసు సాంబమూర్తి, భోగరాజు పట్టాభి సీతారామయ్య, కళా వెంకట్రావు వంటి దేశభక్తులతో కలసి రామసుబ్బమ్మ ఈ సత్యాగ్రహంలో ఉత్సాహంగా పాలు పంచుకున్నారు.

మద్రాసు ప్రెసిడెన్సీలో శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలుండేవి. ప్రెసిడెన్సీలో తమిళుల ప్రాబల్యం అధికంగా ఉండేది. కాబట్టి మద్రాసు నుంచి ఆంధ్రను విడదీసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుచేయాలనే డిమాండుతో 1913లో ప్రారంభమైన ఉద్యమం 1912 నాటికి ఉధృతి దాల్చింది. ఈ పరిస్థితుల్లో రామసుబ్బమ్మ ఒకవైపు జాతీయోద్యమంలో పాల్గొంటూనే.. మరోవైపు ఆంధ్రోద్యమం గురించి భర్త కోటిరెడ్డితో కలిసి ఆంధ్రనాయకులతో సమాలోచనలు జరిపారు. ఆంధ్ర రాష్ట్రాద్యమానికి ఉపాధ్యక్షురాలుగా కూడా ఎన్నుకోబడ్డారు. నిర్వహణలో భాగంగా రాష్ట్రమంతటా పర్యటించి, మహాసభలు నిర్వహిస్తూ ప్రజలలో జాగృతిని కలిగించారు.

1940లో మహిళా సమాజాన్ని ఏర్పాటుచేసి స్త్రీల హక్కుల కోసం తీవ్రంగా పోరాటం చేశారు రామసుబ్బమ్మ. అఖిల భారత స్త్రీ సమాజంలో రాష్ట్ర అధ్యక్షురాలిగానూ తన వంతు వంతు సేవల్సి అందించారు. ప్రతి స్త్రీ అక్షరాస్యురాలు కావాలని తపించారు. అ 1938 డిసెంబరులో రామసుబ్బమ్మ కాంగ్రెసు పార్టీ తరపున కడపజిల్లా బోర్డు ప్రెసిడెంటుగా ఎన్నికయ్యారు.

భారతదేశం మొత్తం మీద ఈ పదవికి ఎన్నికయిన మొట్టమొదటి మహిళగా రామసుబ్బమ్మ ఘనత సాధించారు. తనకు లభించిన పదవిని కిరీటంగా కాకుండా భుజస్కంధాలపై బాధ్యతగా సమర్థవంతంగా నిర్వహించి తన దక్షతను నిరూపించుకున్నారు. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంలో గాంధీజీ సూచన మేరకు ఈ పదవిని ఆమె త్యజించారు.

స్వీయ శక్తి సామర్ధ్యాలతోపాటు భర్త ప్రోత్సాహం తోడవడంతో ఎన్నో పదవుల్ని అధిష్ఠించి ఉత్తమ నాయకురాలుగా, ఉత్తమ ఇల్లాలుగా, జీవితాన్ని సార్థకం చేసుకున్న శ్రీమతి రామసుబ్బమ్మ చిరస్మరణీయురాలు.