News

కవులు ఉన్నంత కాలం తెలుగు వైభవం తగ్గదు

309views

వేటూరి సాహిత్యం అజరామరమని సినీ రచయిత, దర్శకుడు జె.కె.భారవి పేర్కొన్నారు. వేటూరి సాహితీపీఠం, శ్రీప్రకాష్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో భారవికి 13వ వేటూరి సాహితీ పురస్కారాన్ని అందజేశారు. ఆయనకు 150 పుస్తకాలిచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలలు చెదిరినా, కలత చెందినా దానిని పాటగా మలచడంలో వేటూరి సిద్ధహస్తుడన్నారు. పాటల రూపంలో అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. కవులు ఉన్నంతకాలం తెలుగు భాష వైభవం తగ్గదని చెప్పారు. నేటి యువతకు చాలా అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. రచయితలకు ధనం కన్నా వాక్చాతుర్యం, రచనశైలే నిజమైన సంపదని అభివర్ణించారు. అన్నమయ్య, రామదాసు, మంజునాథ సినిమాల కన్నా ఆది శంకరాచార్య సినిమాకు యూట్యూబ్‌ వీక్షకులు ఎక్కువగా ఉండటం తనకు వచ్చిన విజయంగా భావిస్తున్నానన్నారు. వేటూరి వేడుకలు చేయడమంటే తెలుగు సాహిత్యాన్ని గౌరవించుకోవడమేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అన్నవరం ఈవో రామచంద్రమోహన్‌, రసమాధురి వ్యవస్థాపక అధ్యక్షుడు పి.సీతారామప్రభు, వేటూరి సాహితీపీఠం వ్యవస్థాపక కార్యదర్శి కె.ఆర్‌.జె.శర్మ, సీహెచ్‌.విజయ్‌ప్రకాష్‌, చక్కా సూర్యనారాయణ, సీహెచ్‌.రామసీత తదితరులు పాల్గొన్నారు.