News

ఇరుపక్షాలకూ జ్ఞానవాపి సర్వే ప్రతులు

253views

జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో భారత పురావస్తు పరిశోధన శాఖ (ఏఎస్‌ఐ) నిర్వహించిన సర్వే నివేదిక ప్రతులను హిందూ, ముస్లిం పక్షాలకు అందజేసేందుకు వారణాసి జిల్లా కోర్టు అంగీకరించింది. ఈ మేరకు జడ్జి ఎ.కె.విశ్వేశ్‌ బుధవారం ఉత్తర్వులిచ్చారు. జిల్లా కోర్టు గత ఏడాది జులై 21న వెలువరించిన ఆదేశాల మేరకు ఏఎస్‌ఐ…కాశీ విశ్వనాథ ఆలయం చెంతనున్న జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే నిర్వహించింది. దీనికి సంబంధించిన నివేదికను ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు జడ్జి ప్రశాంత్‌ సింగ్‌కు సీల్డ్‌ కవర్‌లో అందజేసింది. నివేదిక ప్రతులను అందజేయడానికి జడ్జి ఓ షరతు విధించారని, దాని ప్రకారం నివేదికను బహిరంగపరచబోమంటూ రెండు పక్షాలు అఫిడవిట్‌ దాఖలు చేయాల్సి ఉంటుందని హిందువుల తరఫు న్యాయవారి ఒకరు అంతకుముందు తెలిపారు. అయితే, జడ్జి లిఖితపూర్వకంగా ఇచ్చిన ఆదేశాల్లో ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. నివేదికపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయటానికి వీలుగా ఇరుపక్షాలకు ఆ ప్రతులను ఇవ్వాలని ఆదేశించినట్లు జడ్జి ఎ.కె.విశ్వేశ్‌ పేర్కొన్నారు. కాశీ విశ్వనాథ ఆలయం, జిల్లా కలెక్టర్‌, రాష్ట్ర హోంశాఖలకు కూడా ఏఎస్‌ఐ సర్వే ప్రతులను అందజేసేందుకు జడ్జి అనుమతించారు.

వజూఖానా సర్వే కేసు విచారణ నుంచి వైదొలగిన హైకోర్టు జడ్జి
జ్ఞానవాపి మసీదు ప్రాంగణం వజూఖానాలోని శివలింగం ప్రాంతాన్ని ఏఎస్‌ఐ సర్వే నుంచి మినహాయిస్తూ వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేసిన పిటిషన్‌పై విచారణ నుంచి అలహాబాద్‌ హైకోర్టు జడ్జి మనీశ్‌ కుమార్‌ నిగం బుధవారం వైదొలగారు. ఈ కేసు విచారణకు మరో జడ్జీని కేటాయించాలని ప్రధాన న్యాయమూర్తికి ధర్మాసనం విజ్ఞప్తి చేసింది. తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది.